కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులపై మంత్రి హరీశ్ సమీక్ష

కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వివిధ కీలక అనుమతులను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సాగునీటి మంత్రి హరీశ్ రావు ప్యాకేజీ 10 నుంచి ప్యాకేజీ 14 వరకు కాళేశ్వరం ప్రాజెక్టు పనులను, భూసేకరణ, పునరావాసం, సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్ల నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. హైదరాబాద్ లోని జలసౌధలోఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ సమావేశం జరిగింది.

గత 15 రోజుల్లోనే హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర, అటవీ, భూగర్భ జల శాఖ, కన్ స్ట్రక్షన్ మెషినరీ తదితర అనుమతులు లభించిన విషయాన్ని మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. ఈ అనుమతులు సాధించడంలో రాష్ట్ర ఇంజనీర్లు, అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు క్రియాశీలకంగా పని చేశారని ప్రశంసించారు. అనుమతుల ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చినందున ఇక పనుల పురోగతిపై ఇంజనీర్లు, ఏజెన్సీలు దృష్టి సారించాలని అన్నారు.

అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ జలాశయాల నిర్మాణం, పంప్ హౌజ్, సర్జ్ పూల్, టన్నెల్స్, కాలువల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను మంత్రి హరీశ్ రావు అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ జరగకపోవడం వల్ల కొన్నిచోట్ల భూ యజమానులు అడ్డుకుంటున్నారని, భూసేకరణ జరిగిన చోట ఇంకా పంటలు ఉండడం చేత పనులు ఆలస్యం అవుతున్నాయని ఏజెన్సీల ప్రతినిధులు తెలిపారు. కలెక్టర్, ఆర్డీవో లతో సమన్వయం చేసుకొని భూసేకరణ జరిగిన చోట పనులని వెంటనే ప్రారంభించాలని మంత్రి అన్నారు.

టన్నెళ్ళ తవ్వకం 80 నుంచి 90 శాతం పూర్తయినా టన్నెళ్ళ లైనింగ్ పనులు మందకొడిగా సాగుతున్నాయని హరీశ్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. నెలకు కనీసం 2 కిలోమీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేసేవిధంగా కార్యాచరణ తయారు చేసుకోవాలని సూచించారు. అందుకు మరిన్ని గ్యాంట్రీ క్రేన్లను, బూమర్లను సమకూర్చుకోవాలని ఏజెన్సీలకు మంత్రి చెప్పారు. సివిల్, మెకానికల్ ఏజెన్సీల మధ్య సమన్వయం మెరుగుపర్చుకోవాలన్నారు.   టన్నెళ్ళ పనుల్లో సెక్యూరిటీ సంబంధిత నిపుణుల కమిటీ సూచనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. టార్గెట్ ప్రకారం పనులను పూర్తి చేయని ఏజెన్సీలపై ఎల్డీలు విధించాలని మంత్రి ఇంజనీర్లకు చెప్పారు. పెండింగ్ డిజైన్స్ అన్నింటిని త్వరితగతిన పూర్తి చేసి అందించాలని సీడీవో చీఫ్ ఇంజనీర్ ని ఆదేశించారు.

పంపు హౌజ్ లకు విద్యుత్ సరఫరా చేసేందుకు సబ్ స్టేషన్ల నిర్మాణం, పవర్ లైన్ల నిర్మాణం కూడా సమాంతరంగా పూర్తి చేయాలని ట్రాన్స్ కో అధికారులను మంత్రి హరీశ్ రావు కోరారు. వచ్చే ఏడాది (2018) జూన్ నాటికి అన్ని పనులు పూర్తి చేసి నీటి సరఫరాకు సిద్ధం చేయాలని ఆదేశించారు. కొండ పోచమ్మ సాగర్ జలాశయం నుంచి బయలుదేరే కాలువల అంచనాలను వెంటనే తయారు చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపాలని ఇఎన్ సి మురళీధర్ ని కోరారు.

మల్లన్న సాగర్ జలాశయం భూసేకరణ పురోగతిని మంత్రి తెలుసుకున్నారు. 13,969 ఎకరాల్లో 11,187 ఎకరాలను ఇప్పటికే సేకరించామని (80శాతం) సిద్దిపేట కలెక్టర్ వెంకట్రాం రెడ్డి తెలిపారు. ముంపు గ్రామాలైన తొగుటలో 79 శాతం, ఏటిగడ్డ కిష్టాపూర్ లో 87 శాతం, పల్లె పహాడ్ లో 97 శాతం, సింగారంలో 91 శాతం, ఎర్రవల్లిలో 98 శాతం, తుక్కాపూర్, మంగోల్ లలో 100 శాతం, తిప్పారంలో 65 శాతం, వేముల ఘాట్ లో 53 శాతం  భూసేకరణ పూర్తి అయ్యిందని కలెక్టర్ వివరించారు. మిగతా భూమి సేకరణ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు కోరారు. వారం వారం ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించాలని ఈ ఎన్ సీ మురళీధర్ ని మంత్రి ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎస్ కె జోషి, ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, ఇంజనీర్ ఇన్ చీఫ్ (అడ్మినిస్ట్రేషన్) నాగేందర్ రావు, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రాం రెడ్డి, ట్రాన్స్ కో డైరెక్టర్ జగత్ రెడ్డి, ఎస్ఈ వేణు, ఆర్డీవో, ఈఈ, డీఈఈ, ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.