కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా దక్కకుండా ఓడించాలి

కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా వచ్చే ఎన్నికల్లో ఓడించాలని మంత్రి హరీశ్ రావు ప్రజలను కోరారు. పాలమూరులో ఆకలి, కరువు, వలసలకు గత ప్రభుత్వాలే కారణం అన్నారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఇవాళ టిఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. అభివృద్ధే ధ్యేయంగా టిఆర్ఎస్ పనిచేస్తుంటే, అధికారం కోసం కాంగ్రెస్ అర్రులు చాస్తోందని విమర్శించారు.

కొడంగల్ లో టిఆర్ఎస్ గెలుపుతోనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ ద్వారా కొడంగల్ లో లక్షా 10 వేల ఎకరాలకు నీళ్లిస్తామన్నారు. పాలమూరు జిల్లాలో రెండేళ్లుగా 500 చెరువులు నింపుతున్నామని వివరించారు.

ముస్లింల కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న షాదీ ముబారక్, గురుకులాలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇతర పథకాలను నిన్న హైదరాబాద్ వచ్చిన జమ్మూకాశ్మీర్ మంత్రులు ప్రశంసించారని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. కాశ్మీర్ లో కూడా తాము ఇలాంటి పథకాలు చేపట్టలేదని అబ్బురపడ్డారని తెలిపారు. ముస్లింలను పేదరికం నుంచి బయటపడేసేందుకు సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి చెప్పారు.

కేసీఆర్ చావు నోట్లోకి వెళ్లి కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చిన్రని మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. ఆనాడు పదవులు త్యాగాలు చేసి తెలంగాణ కోసం కొట్లాడిన టిఆర్ఎస్ నేతలు కోదండరామ్ కు చేదు అయిన్రని, ఆనాడు రాజీనామాలు చేయకుండా తప్పించుకున్న తెలంగాణ ద్రోహులు ఆయనకు ముద్దు అయిన్రని విమర్శించారు.