కష్టపడి అలసిపోయినప్పుడే సంతోషంగా ఉంటా

‘డీజే’లో అందాల బొమ్మలా కనిపించి వెండితెరను వేడెక్కించింది పూజా హెగ్డే. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ పునరాగమనం చేసి అందరినీ ఆకట్టుకుంది. డీజే తర్వాత తెలుగులో పూజా హెగ్డే అవకాశాలు చాలా మెరుగుపడ్డాయి. ప్రస్తుతం శ్రీవాస్‌ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న సాక్ష్యం సినిమాలో నాయికగా నటిస్తోంది. దీంతో పాటు రంగస్థలం, వేటగాడు అనే చిత్రాల్లో ప్రత్యేక గీతాలు అంగీకరించింది. ఇలా ప్రాంతీయ చిత్రాల్లో నటిస్తూనే…బాలీవుడ్‌లో కొనసాగుతోంది. సల్మాన్‌ ఖాన్‌, బాబీ డియోల్‌ నటిస్తున్న రేస్‌ 3 లో ప్రాధాన్య పాత్ర పోషిస్తోంది. ఇలా దక్షిణాది, బాలీవుడ్‌ చిత్రాలతో పూజా తీరిక లేకుండానే గడుపుతోంది. అయితే ఈ ప్రయాణాన్ని శ్రమగా భావించడం లేదంటోందీ సుందరి. కష్టపడి అలసిపోయినప్పుడే సంతోషంగా ఉంటానంటోంది. కొత్త విషయాలు నేర్చుకోవడంఇష్టమని చెబుతోంది. ఇటీవల ఓ సందర్భంలో పూజా హెగ్డే మాట్లాడుతూ…’మా తారల వృత్తి జీవితం చాలా సార్లు విసుగెత్తుతుంది. చిత్రీకరణ వెళ్లడం, మళ్లి హోటల్‌కు రావడం, తిరిగి షూటింగ్‌లో పాల్గొనడం…కొన్నేళ్ల పాటు ఇదే ప్రక్రియ కొనసాగుతుంటుంది. కొన్ని సార్లు అలసిపోయి తెలియకుండానే నిద్రపోతాం. ఇది విసుగు తెప్పిస్తుంది. అయినా…ఇలా అలసిపోయేంత కష్టపడటం నాకు సంతోషాన్నిస్తుంది.’ అని చెప్పింది. త్వరలో చిత్రీకరణకు వెళ్లనున్న మహేష్‌బాబు 25వ సినిమాకు పూజాను నాయికగా ఎంచుకునే అవకాశాలున్నాయి.