కల సాకారం చేసుకున్న కేసీఆర్ సర్కారు 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే.. మెట్రోరైలు ప్రాజెక్టు పూర్తికాదు.. రైలు ఎక్కేందుకు జనాలుండరు.. ఎల్‌అండ్‌టీ వెనుకకుపోవడం ఖాయం.. వీటిని దృష్టిలో పెట్టుకొని రాష్ర్టాన్ని విడగొట్టొద్దు.. ఇవీ రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ఆధిపత్య నాయకత్వం చేసిన విష ప్రచారం. నేతలు మొదలుకొని రాతల వరకు అంతా మెట్రోను వాడుకొని గగ్గోలు పెట్టినవారే. కానీ అదంతా దుష్ప్రచారమేనని అనతికాలంలోనే తేలిపోయింది. రాదనుకున్న తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సాధ్యం కాదనుకున్న మెట్రో మరో వారం రోజుల్లో పరుగులు పెట్టనున్నది. వాస్తవంగా  మెట్రోకు నాటి ఉమ్మడి ప్రభుత్వం ఇచ్చి న చేయూత కన్నా.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రొత్సాహమే ఎక్కువ. సీఎం కేసీఆర్‌ నుంచి ప్రభుత్వశాఖల కార్యదర్శుల వరకు అంతా ప్రాజెక్టుకు బాసటగా నిలిచారు. మొదట్లో తెలంగాణ ప్రభుత్వంతో అంటీముట్టనట్టు వ్యవహరించిన ఎల్‌అండ్‌టీవర్గాలు తర్వాత సీఎం కేసీఆర్ చరిష్మా, నాయకత్వాన్ని చూసి తప్పుచేశామన్న భావనకు వచ్చాయి. ప్రాజెక్టు పట్ల ప్రభుత్వ నిబద్ధతను.. సీఎం కేసీఆర్ చొరవను, ఆయనలోని దూరదృష్టిని ప్రత్యక్షంగా చూసిన ఎల్‌అండ్‌టీ మెట్రో చైర్మన్ ఏఎం నాయక్ సీఎం కేసీఆర్‌తో భేటీలో ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు.

మెట్రోలో కారిడార్-2, 3ల్లో 2.23 కిలోమీటర్ల మేర మెట్రోమార్గం రక్షణశాఖకు చెందిన స్థలాల గుండా వెళ్తున్నది. కారిడార్ల నిర్మాణానికి 3.65 ఎకరాలు, పరేడ్‌గ్రౌండ్స్ వద్ద ఇంటర్‌ చేంజ్ స్టేషన్ నిర్మాణం కోసం రక్షణశాఖకు చెందిన 2.15 ఎకరాలు సేకరించాల్సి ఉన్నది. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. ఎవరూ పట్టించుకోకపోవడంతో రక్షణశాఖ నుంచి క్లియరెన్స్ రాలేదు. జూన్ 2న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఏకంగా అప్పటి రక్షణశాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో సంప్రదింపులు జరిపారు. 2.15 ఎకరాలు భూ బదలాయింపు ద్వారా, 3.65 ఎకరాలు లీజు ద్వారా మెట్రోకు దక్కేలా చర్చలు జరిపారు. ఫలితంగా జూన్ 19న ఈ స్థలాల సేకరణ పూర్తయింది. ఇప్పుడు సికింద్రాబాద్ గణేశ్ దేవాలయం వద్ద రక్షణశాఖకు చెందిన స్థలం గుండానే మెట్రో పరుగులు పెట్టబోతున్నది.

మూడు కారిడార్ల పరిధిలో ఎనిమిది చోట్ల రైల్వే ట్రాక్‌లపైనుంచి మెట్రో మార్గాన్ని నిర్మించాల్సి ఉన్నది. రైళ్లను రద్దుచేసి.. విద్యుత్‌ నిలిపివేసి మెట్రో పనులు చేపట్టాల్సి ఉండడంతో రైల్వేశాఖ అంగీకరించలేదు. అధికారులు మూడేండ్లపాటు ప్రయత్నించినా ఫలితం శూన్యం.  సీఎం కేసీఆర్ 2015 జనవరి 19న రైల్వేశాఖమంత్రి సురేశ్‌ప్రభుతో చర్చలు జరిపి ఎనిమిది రైల్వే క్రాసింగ్‌లపై మెట్రో నిర్మాణానికి అనుమతులిప్పించారు. రైల్వే ట్రాఫిక్‌ను నిలిపివేసినందుకు నష్టపరిహారంగా చెల్లించే 180 కోట్ల రైల్వే బ్లాక్‌చార్జీలు లేకుండానే రైళ్లను మళ్లించేందుకు ఒప్పించారు. రైల్వే ఆస్తుల సేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించారు. కారిడార్-3లోని నాగోల్-శిల్పారామం మార్గంలో గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు 4.6 కిలోమీటర్ల మధ్య ఆస్తుల సేకరణపై హైకోర్టు స్టే విధించింది. దీంతో రెండేండ్లపాటు పనులు నిలిచిపోయాయి. హైకోర్టు స్టేను ఎత్తివేసేందుకు సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. అడ్వకేట్ జనరల్ తో సీఎం జరిపిన చర్చల ఫలితంగా స్టే తొలిగిపోయింది. కోర్‌సిటీలో ఆస్తుల సేకరణ చిక్కులు.. రైట్ ఆఫ్ ది వే అందుబాటులో లేకపోవడంతో ప్రాజెక్టు పనులు శివారు ప్రాంతాలకే పరిమితమయ్యాయి. రైట్ ఆఫ్ ది వే కోసం ఎల్‌అండ్‌టీ పలుమార్లు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంతో పేచీకి దిగిన సందర్భాలున్నాయి.  తెలంగాణ ప్రభుత్వం రైట్ ఆఫ్ ది వే ను ఇప్పిచ్చేందుకు చొరవ తీసుకున్నది. సీఎం కేసీఆర్ మెట్రోపై సమీక్షలు జరిపి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించారు. 72 కి.మీల మార్గంలో ఎంబీజీఎస్-ఫలక్‌నుమా మార్గం తప్ప మిగతా రైట్ ఆఫ్ ది వే సిద్ధం చేసి ఉంచారు.

ఒప్పందం ప్రకారం ట్రాక్షన్ సేవలకు వినియోగించే 125 మెగావాట్ల విద్యుత్‌కు రాయితీ కల్పించాల్సి ఉన్నది. రాయితీ కల్పించాలని ఎల్‌అండ్‌టీ పలుమార్లు మొత్తుకున్నా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మెట్రో ప్రాజెక్టుకు రాయితీతో కూడిన కరంటును సరఫరా చేసేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారు. ట్రాక్షన్ కరంటుకు ట్రాన్స్‌ మిషన్, సర్వీస్‌చార్జీలను మినహాయించారు. ప్రాజెక్టులోని పిల్లర్లు, వయాడక్ట్, స్టేషన్లలో అడ్వర్టయిజ్‌మెంట్ బోర్డుల ఏర్పాటు ద్వారా వచ్చే ఆదాయంలో వాటాపై ఎల్‌అండ్‌టీ, జీహెచ్‌ఎంసీల మధ్య సమన్వయం లేకపోవడంతో సందిగ్ధ వాతావరణం నెలకొన్నది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చొరవతో అడ్వర్టయిజ్‌ మెంట్ బోర్డుల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. హక్కులు పొందిన వారు పిల్లర్లపై బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దలు మెట్రో విస్తరణ పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. రెండో దశలో 60 కి.మీలు చేపట్టాలని ప్రతిపాదించి ఆ తర్వాత గాలికొదిలేశారు. కానీ ఈ ప్రాజెక్టును ఏకంగా 200 కిలోమీటర్లకు విస్తరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇన్నర్‌ రింగ్‌రోడ్ చుట్టూ మెట్రో లైన్‌వేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడేనాటికి ప్రాజెక్టు కోసం సేకరించాల్సిన ఆస్తుల సంఖ్య 1,276. జనవరి 2015 వరకు ఒక్క అడుగు ముందుకు పడకపోవడంతో నిర్మాణంలో అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించడంతో రెండున్నర నెలల్లో 1,022 ఆస్తులను సేకరించారు. దీంతో 2015 మార్చి 3 నాటికి 254 ఆస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఆస్తుల సేకరణపై 2011 నుంచి 130 కోర్టు కేసులు హెచ్‌ఎంఆర్ మెడకు చుట్టుకున్నాయి. దీంతో ప్రాజెక్టు ముందుకు సాగలేదు. నిర్మాణంపై దృష్టిపెట్టాల్సిన ఇంజినీర్లు కోర్టుల చుట్టూ తిరుగాల్సి వచ్చింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అడ్వకేట్ జనరల్‌తో, న్యాయశాఖ కార్యదర్శితో సంప్రదింపులు జరిపింది. ఫలితంగా 115 కేసుల్లో
హెచ్‌ఎంఆర్ గెలిచింది. దీంతో ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. శిల్పారామం ఎదురుగా టెర్మినల్ స్టేషన్ కోసం ప్రతిపాదించిన స్థలం చెరువు భూమిగా తేలింది. భూ పొరలు పటిష్ఠంగా లేకపోవడం, వీక్‌సాయిల్ కావడంతో నిర్మాణ పరంగా ఇబ్బందులు తలెత్తాయి. స్టేషన్ నిర్మాణానికి స్థలం అధికంగా కావాల్సి వచ్చింది. ప్రభుత్వం మెట్రోను ఐటీకారిడార్‌కు ఉపయోగపడేలా 1.2 కిలోమీటర్‌ పెంచి రాయదుర్గం వైపు మళ్లించింది. మైండ్‌స్పేస్ జంక్షన్ వద్ద టెర్మినల్ స్టేషన్ నిర్మించడానికి టీఎస్‌ఐఐసీ స్థలాన్ని కేటాయించింది. ఇలా ఉమ్మడి రాష్ట్రంలో పేరుకపోయిన ఎన్నో ఇబ్బందులను పరిష్కరించి.. సీఎం కేసీఆర్‌ మెట్రోను పరుగులు పెట్టించడంలో కీలకపాత్ర పోషించారు.