ఐకాన్ చార్మినార్!

హైదరాబాద్ ఐకాన్ ప్రఖ్యాత చార్మినార్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది. దేశంలోని ప్రఖ్యాత 10 ఐకానిక్ స్థలాల్లో ఒకటిగా భారత ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో ఐకానిక్ ప్రాంతాలలో ప్రత్యేక పరిశుభ్రతను చేపట్టడం ద్వారా దేశంలోనే స్వచ్ఛ మోడల్ గా రూపొందించేందుకు 10 ప్రఖ్యాత స్థలాలను ఐకానిక్ గా గుర్తించింది.

దేశంలోని వంద ప్రసిద్ధ ఐకాన్ నగరాలను స్వచ్ఛతకు మోడల్ గా తీర్చిదిద్దడానికి స్వచ్ఛ భారత్ మిషన్ సంకల్పించింది. దీనిలో భాగంగా మొదటి దశలో అమృతసర్ తో సహా పది ప్రాంతాలను స్వచ్ఛ ఐకాన్ గా గుర్తించింది. రెండవ దశలో చార్మినార్ తో సహా పది నగరాలను ఐకానిక్ ప్రాంతాలుగా స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించింది. దీనిలో భాగంగా ఒక్కో ఐకానిక్ ప్లేస్ ను స్వచ్ఛత పరంగా సమగ్ర అభివృద్ధికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగిస్తారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఆయా ఐకానిక్ ప్లేస్ లో చేపట్టాల్సిన స్వచ్ఛ కార్యక్రమాలపై స్థానిక పాలనా యంత్రాంగంతో చర్చించి ప్రణాళికబద్దంగా పనులు చేపట్టడానికి కావాల్సిన నిధులను అందజేస్తుంది.

హైదరాబాద్ నగరంలోని చార్మినార్ ను స్వచ్ఛ ఐకాన్ గా రూపొందించడానికి ఎన్టీపీసీకి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ అంశంపై చార్మినార్ తో పాటు పరిసర ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులు, చర్యలపై న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశాన్ని నేడు స్వచ్ఛ భారత్ మిషన్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి జీహెచ్ఎంసి కమిషనర్ డాక్టర్ బి. జనార్దన్ రెడ్డి ప్రత్యేకంగా హాజరయ్యారు. చార్మినార్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఈ సమావేశంలో చర్చించారు. దేశంలోనే చార్మినార్ ను  స్వచ్ఛతకు మారుపేరుగా రూపొందించడానికి కావాల్సిన ఆర్థిక, సాంకేతిక సహకారం అందించడం, కాల పరిమితి తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చలు జరిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ జనరల్ అక్షయ్ రౌత్ తదితర అధికారులు పాల్గొన్నారు.

ఐకానిక్ ప్రాంతాల జాబితాలో చార్మినార్ (హైదరాబాద్)తో పాటు.. గంగోత్రి, యమునోత్రి, మహాకాళేశ్వర్ టెంపుల్ (ఉజ్జయిన్), సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి అండ్ కాన్వెంట్ (గోవా), ఆదిశంకరాచార్యుల జన్మస్థలం (ఎర్నాకులం), గోమఠేశ్వర్ (శ్రావణబెలగొళ), బైజ్ నాథ్ ధామ్ (దేవ్ ఘర్), గయ తీర్థ్ (బీహార్), సోమనాథ్ ఆలయం (గుజరాత్) ఉన్నాయి.