ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి నిజాయితీతో ఖర్చు పెడుతున్నాం

షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) అభివృద్ధికి కేటాయించిన నిధులు పక్కదారి పట్టలేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కేటాయించిన ప్రతీ పైసా నిజాయితీగా ఖర్చు చేస్తున్నామన్నారు. వారి అభివృద్ధికి ఖర్చు చేసిన వ్యయ రికార్డుల వివరాలు సుమారు లక్ష పేజీలు పెన్‌డ్రైవ్‌లో సభ్యులకు అందజేసినట్లు సీఎం తెలిపారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి ఖర్చు చేసిన నిధుల నుంచి కింది స్థాయిలో లబ్ధిదారుడి వరకు అన్ని వివరాలు ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి చట్టం చేసిందని పేర్కొన్నారు.

షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. ప్రగతి పద్దు కింద మొత్తం కేటాయింపు రూ. 88 వేల 71 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ. 33 వేల 462 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం పేర్కొన్నారు. ప్రగతి పద్దు కింద ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి అధికంగానే ఖర్చు చేశామన్నారు. ఎస్సీ ప్రత్యేక నిధి కింద రూ. 14,375.13 కోట్లు కేటాయించగా.. ఇప్పటి వరకు రూ. 5,475.02 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇక ఎస్టీ ప్రత్యేక నిధి కింద రూ. 8,165.87 కోట్లు కేటాయించగా.. ఇప్పటి వరకు రూ. 3,359.37 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు.

ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన నిధుల ఖర్చులో అధికారుల అలసత్వం ఉందని తెలిస్తే.. అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎస్సీ నిధులు పక్కదారి పడుతున్నాయని ఎమ్మెల్యే సంపత్ చేసిన వ్యాఖ్యలను సీఎం తప్పుబట్టారు. వాస్తవాలను వక్రీకరించడం సరికాదన్నారు. లెక్కాపత్రం లేకుండా నిధులు మళ్లించారని విమర్శిస్తే సహించేది లేదని సీఎం తేల్చిచెప్పారు. ఎస్సీలకు కేటాయించిన నిధులు పక్కదారి పట్టింది గత కాంగ్రెస్ పాలనలోనేనని ముఖ్యమంత్రి వివరాలతో సహా తెలిపారు.  తమ ప్రభుత్వంలో అలా జరిగిందనడం అవాస్తవమని సీఎం స్పష్టం చేశారు. ఎస్సీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2,651 కోట్లు ఖర్చు చేస్తే.. తమ ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలంలో రూ. 6,713 కోట్లు ఖర్చు చేసిందన్నారు.

అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కింద ఒక్కో ఎస్సీ విద్యార్థికి రూ. 20 లక్షలు స్కాలర్ షిప్ ఇస్తున్నామని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఈ పథకం లేదన్నారు. టీఎస్‌ ప్రైడ్ కింద దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. సివిల్ ఇంజనీరింగ్ చదివిన దళిత యువతను కాంట్రాక్టర్లుగా అభివృద్ధి చేసేందుకు న్యాక్ లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. వంద శాతం సబ్సిడీతో ఎస్సీలకు రుణాలు ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. భారతదేశంలో ఎక్కడా జరగనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలోనే అమలవుతున్నాయని వివరించారు.

ప్రభుత్వం ఏ విషయంలోనైనా పారదర్శకంగా ఉండాలనుకుంటుంది.. కానీ పారిపోవాలనుకోవడం లేదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. దళిత, గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై ఇదే అసెంబ్లీ సమావేశాల్లో రెండు రోజులు కచ్చితంగా చర్చ చేపడుదామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.