ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి రూ. 5,683 కోట్ల ఖర్చు

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కేటాయించిన నిధులకంటే ఎక్కువే ఖర్చు చేస్తున్నామని ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ డెవలప్మెంట్ కోసం 5,683 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అలాగే.. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్‌ మెంట్ ట్రైనింగ్ ఇచ్చి.. ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. గతంలో వారు చేసిందే కాకుండా.. సమాజంలో ప్రస్తుతం ఉన్న డిమాండ్‌తో పాటు.. వారు చదివిన దానికి అనుగుణంగా స్కిల్ డెవలప్‌ మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి వివరించారు. మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు చెప్పారు.

కంది రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. తాండూరు, పాలెం, వరంగల్‌ లో ఇప్పటికే కంది పరిశోధనా కేంద్రాలు ఉన్నాయన్నారు. ఈ పరిశోధనా కేంద్రాల్లో 11 కొత్త కంది వంగడాలు సృష్టించినట్లు పోచారం తెలిపారు. అలాగే  రాష్ట్రంలో కంది బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి  ప్రతిపాదనలు పంపుతామన్నారు. మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమాధానం చెప్పారు.

నిజామాబాద్‌ నగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సులు నడుపుతున్నామని తెలిపారు రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి. నగరంలో సిటీ బస్సులు కూడా ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. నిజామాబాద్ బస్టాండ్, బస్ డిపోలను అక్కడి నుంచి తరలించే ఉద్దేశం లేదన్నారు. అలాగే,.. కలెక్టరేట్‌ వద్ద కూడా బస్‌ స్టాప్‌ నిర్మించి.. బస్సులు నడుపుతామని వెల్లడించారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి మహేందర్ రెడ్డి సమాధానం చెప్పారు.