ఎస్టీల కరెంట్ బిల్లులు రద్దు

గిరిజనుల సమగ్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారు. గిరిజన ఆవాస ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో గిరిజన ప్రజా ప్రతినిధులతో ఇవాళ సమావేశమైన ముఖ్యమంత్రి, ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ఎస్టీల విద్యుత్ బకాయిలన్నీ రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఎస్టీలపై ఉన్న విద్యుత్ కేసులన్నీ రద్దు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఎస్టీ ఆవాస ప్రాంతాలకు, ప్రతీ ఎస్టీ ఇంటికి, ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఉన్న వాటితో సహా ప్రతీ ఎస్టీ వ్యవసాయ దారుడికి విద్యుత్ కనెక్షన్ కల్పించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతీ ఎస్టీ ఆవాస ప్రాంతానికి రోడ్డు వేసేందుకు వచ్చే బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. ఆదివాసీ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పి స్థానికులకే ప్రవేశం కల్పించే విధానం అమల్లోకి తెస్తామన్నారు. గొర్రెల పెంపకం లాంటి స్వయం ఉపాధి పథకాలు ఎస్టీలకు కూడా వర్తింపచేస్తామని చెప్పారు.

డొమెస్టిక్ కేటగిరీలో చాలా మంది ఎస్టీలు బకాయిలున్న విషయం సమావేశంలో చర్చకు వచ్చింది. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ కూలంకశంగా చర్చించి, బకాయిలన్నీ రద్దు చేయాలని నిర్ణయించారు. రూ.70 కోట్లకు పైగా ఉన్న బకాయిలను రద్దు చేయాలని, వీటికి సంబంధించి 40 కోట్ల రూపాయలను విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించాలని సీఎం ఆదేశించారు. మిగతా 30 కోట్ల రూపాయలను తాము మాఫీ చేస్తామని ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు ముందుకొచ్చారు.

ఎస్టీలపై పెట్టిన విజిలెన్స్ కేసులు కూడా ఎత్తేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రతీ ఎస్టీ ఇంటికి రూ.125 మాత్రమే ఫీజు తీసుకుని కరెంట్ సౌకర్యం కల్పించాలని విద్యుత్ అధికారులను కోరారు. ఒక్కో కనెక్షన్ కు రూ.125 మాత్రమే దరఖాస్తు ఫీజు తీసుకుని కనెక్షన్ ఇస్తామని విద్యుత్ అధికారులు చెప్పారు. ప్రతీ ఇంటికి సర్వీస్ వైరు, ఇంటిలోపల వైరింగ్, రెండు లైట్లు ఏర్పాటు చేస్తామని, 50 యూనిట్ల లోపు వినియోగించే వారి నుంచి ఎలాంటి చార్జీ తీసుకోబోమని అధికారులు చెప్పారు.

ఎస్టీ ఆవాస ప్రాంతాలన్నింటికీ త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,737 ఎస్టీ ఆవాస ప్రాంతాలుండగా, 8,734 గ్రామాల్లో త్రీ ఫేజ్ కరెంటు లేదని, సమైక్య రాష్ట్రంలో జరిగిన నిర్లక్ష్యానికి ఇదొక ఉదాహరణ అని సిఎం చెప్పారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఉన్న వారితో సహా ఎస్టీ వ్యవసాయ దారులందరికీ విద్యుత్ సర్వీసు సౌకర్యం కల్పించి, ఉచిత విద్యుత్ అందిస్తామని సిఎం హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. అటవీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల నిర్మాణానికి అవసరమైన వ్యూహం రూపొందించాలని పిసిసిఎఫ్ ఝాను సిఎం కోరారు. ఎస్టీ ఆవాస ప్రాంతాలన్నింటికీ రహదారి సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికోసం వచ్చే బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఆర్థిక మంత్రిని కోరారు.

రెసిడెన్షియల్ పాఠశాలల వల్ల ఎస్టీ పిల్లలకు ఎంతో మేలు కలుగుతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ పాఠశాలల్లో ప్రవేశానికి విపరీతమైన డిమాండ్ ఉన్నందున, మరికొన్ని పాఠశాలలు ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. ఆదివాసీలకు ఎక్కువ అవకాశం రావడానికి వీలుగా ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించి, స్థానికులకే అవకాశం దక్కే విధానం తీసుకు వస్తామని అన్నారు.

బ్యాంకులతో సంబంధం లేకుండా ఎస్టీల స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందుకోసం పథకాల రూపకల్పన చేయాలని అధికారులను సీఎం కోరారు. ప్రభుత్వం ఎస్టీల అభివృద్దికి కట్టుబడి ఉందని, ఎస్టీలలోని అన్ని తెగలు, జాతులు సమైక్యంగా ఉండి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్టీ ప్రజా ప్రతినిధులే పూర్తి స్థాయి సమన్వయంతో ఎస్టీ తెగలు, జాతుల మధ్య ఐక్యత సాధించాలని చెప్పారు.

ఎస్టీ ప్రజా ప్రతినిధులతో కమిటీలు: 
అన్ని ఎస్టీ ఆవాస ప్రాంతాలకు ఖచ్చితంగా రోడ్డు సౌకర్యం కల్పించే విషయంలో అధికారులతో సమన్వయం చేసుకోవడానికి సీనియర్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ నాయకత్వంలో కమిటీని నియమించారు.
విద్య, స్వయం ఉపాధి విషయాల్లో సమన్వయానికి ఎంపీ సీతారాం నాయక్ నాయకత్వంలో కమిటీని నియమించారు.
విద్యుత్తుకు సంబంధించిన అంశాలను సమన్వయం చేయడానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నాయకత్వంలో కమిటీని నియమించారు.

ఈ సమావేశంలో మంత్రులు ఈటెల రాజెందర్, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, జెన్ కో – ట్రాన్స్ కో సిఎండి డి.ప్రభాకర్ రావు, డిజిపి ఎం.మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిఆర్ మీనా, ముఖ్య కార్యదర్శులు ఎస్. నర్సింగ్ రావు, మహేశ్ దత్ ఎక్కా, ఎస్టీ అభివృద్ది శాఖ కార్యదర్శి రజత్ కుమార్, కమిషనర్ లక్ష్మణ్, ఎంపీలు సీతారాం నాయక్, నగేశ్, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎస్.పి.డి.సి.ఎల్. సిఎండి రఘుమారెడ్డి, ఎన్.పి.డి.సి.ఎల్. సిఎండి గోపాలరావు, ట్రాన్స్ కో జెఎండి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.