ఎస్టీల్లో పేదరికాన్ని తరిమి కొడదాం

ఎస్టీలంతా ఐక్యంగా ఉండి ప్రభుత్వ పథకాలతో లబ్ది పొందాలని, ఎస్టీల్లో పేదరికాన్ని తరిమి కొట్టడానికి సమైక్యంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నందున… వారికోసం చేపట్టాల్సిన కార్యక్రమాలను, ప్రవేశ పెట్టాల్సిన పథకాలను, తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని కోరారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు.

‘‘తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా ఎస్టీలున్నారు. వారిలో ఎక్కువ మంది పేదలున్నారు. మారుమూల ప్రాంతాలు, ఏజన్సీలలో సమస్యలతో సతమతం అవుతున్నారు. వారి అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది. ఎన్నో ఏళ్లుగా వారు డిమాండ్ చేస్తున్న  ప్రత్యేక గ్రామ పంచాయతీ కోరిక కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తున్నది. ఎస్టీల కోసం ప్రత్యేక ప్రగతి నిధి తీసుకొచ్చింది. ఎస్టీల పిల్లలకు మంచి విద్య అందించడం కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పింది. ఇంకా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. చిన్న జిల్లాలు కావడం వల్ల ఎస్టీ తండాలు, గూడేలు, ఇతర ఆవాస ప్రాంతాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం కలిగింది. ప్రభుత్వ సంకల్పాన్ని ఎస్టీలు అర్థం చేసుకోవాలి. సమైక్యంగా ఉండి, ప్రభుత్వ పథకాల ద్వారా పేదరికాన్ని పారద్రోలడానికి పని చేయాలి. ఇంకా ఏమైనా సమస్యలుంటే పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సమస్యలను, ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.

‘‘ఎస్టీలకు ఇంకా కొన్ని సమస్యలున్నాయి. ఎస్టీ ఆవాస ప్రాంతాలు కొన్నింటిలో త్రీఫేజ్ కరెంటు రావడం లేదు. కొన్నింటికి అసలు కరెంటే లేదు. కొన్నింటికి రోడ్డు సౌకర్యం లేదు. కొన్నింటికి బస్సు సౌకర్యం లేదు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను గుర్తించే విషయంలో సమస్యలున్నాయి. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునే వారికి ప్రభుత్వ సాయం అందే విషయంలో కొన్ని చిక్కులున్నాయి. రెవెన్యూ, అటవీ భూముల లెక్కలు తేలకపోవడంతో అక్కడక్కడ గిరిజనులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. 1/70 చట్టం అమలు విషయంలో కూడా కొన్ని ఇబ్బందులున్నాయి. ఎస్టీ దృవీకరణ పత్రాల విషయంలో సమస్యలున్నాయి. స్వయ ఉపాధి పథకాల్లో బ్యాంకుల నుంచి కాన్సెంట్ రావడం లేదు. ఫలితంగా స్కీములు గ్రౌండ్ కావడం లేదు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులు కూడా కొన్ని చోట్ల జరగాల్సి ఉంది. వీటన్నింటిపై ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది. అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపెడుతుంది” అని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.

“ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? వాటికున్న పరిష్కార మార్గాలేంటి? ఇంకా ఎస్టీల కోసం ఏం చేస్తే బాగుంటుంది? ఎలాంటి కొత్త స్కీములు ప్రవేశ పెట్టాలి? ఈ విషయాలపై ఎస్టీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి. ఓట్ల కోసం కాకుండా ఎస్టీలలో నిజమైన మార్పు కోసం మనమంతా పనిచేద్దాం’’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

ఎస్టీ ప్రజాప్రతినిధులంతా రేపు (శనివారం) ఉదయం సమావేశం నిర్వహించుకుని తగు ప్రతిపాదనలతో ప్రగతి భవన్ కు రావాలని సిఎం కేసీఆర్ కోరారు. శనివారం మధ్యాహ్నం మరోసారి సమావేశమై రాష్ట్రంలో ఎస్టీల కోసం తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టతకు రావాలని సిఎం నిర్ణయించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్.మీనా, ముఖ్య కార్యదర్శి మహేశ్ దత్ ఎక్కా, శాంత కుమారి, ఎంపిలు సీతారామ్ నాయక్, నగేశ్, ఎమ్మెల్యేలు డిఎస్ రెడ్యానాయక్, రవీంద్ర కుమార్, రేఖా నాయక్, కోవ లక్ష్మి, బాబురావు, మదన్ లాల్, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, శంకర్ నాయక్, ఎమ్మెల్సీలు రాములు నాయక్, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ గాంధీ నాయక్, ఎంపిలు గుత్తా సుఖేందర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపి రమేశ్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, ఎస్టీ వెల్ఫేర్ కమిషనర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.