ఎయిడెడ్ స్కూళ్లలో ఖాళీలు భర్తీ చేస్తాం

రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎయిడెడ్ పాఠశాలల్లోని ఖాళీల భర్తీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన  సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 742 ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయన్నారు. ఈ పాఠశాలల్లో 1 లక్షా 23 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నట్లు తెలిపారు. 7 వేల పోస్టులు మంజూరు కాగా, 3500 మంది టీచర్లు పని చేస్తున్నారని చెప్పారు. మరో 3500 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, తాను కలిసి ఈ ఖాళీల భర్తీపై చర్చించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు.