ఎంబీసీల అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయించాం

రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన తరగతులు(ఎంబీసీ)లకు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించామని బీసీ అభివృద్ధి శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎంబీసీల కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాల నుంచి వెనుకబడిన కులాలు లబ్ధి పొందలేదని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ పెద్దమనసుతో వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఎంబీసీలను గుర్తించేందుకు బీసీ కమిషన్ పని చేస్తోందన్నారు. ఇప్పటి వరకు అనేక సమావేశాలు బీసీ కమిషన్ జరిపి వివరాలు సేకరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. బీసీ కమిషన్ తన నివేదికను సమర్పించిన వెంటనే ఎంబీసీలను పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు చర్యలు చేపడుతామన్నారు జోగు రామన్న.