గురువు లేకుంటే గూగుల్ లోకి కూడా పోలేం

ఐఐటీ విద్యను సామాన్య విద్యార్థులకు సైతం పరిచయం చేసిన గొప్ప విద్యావేత్త చుక్కా రామయ్య అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. చుక్కాని చుక్కా రామయ్య రచించిన ‘మొదటి పాఠం’ పుస్తకం తన చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఇవాళ ఆయన జన్మదినం కావడం ఇంకా సంతోషం కలిగిస్తోందని చెప్పారు. ప్రఖ్యాత విద్యావేత్త చుక్కా రామయ్య రచించిన మొదటి పాఠం పుస్తకాన్ని హైదరాబాద్  రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.

ఇది తరగతి గది పుస్తకం…తరగని జ్ఞాపకాల పుస్తకం.. ఎన్నో అనుభవాలు సమ్మేళనం అంటూ ఉప రాష్ట్రపతి ప్రశంసించారు. ఉపాధ్యాయుడు సామాజిక వైద్యుడు అని వ్యాఖ్యానించారు. ఈ పుస్తకం ప్రతి ఉపాధ్యాయునికి ఉపయోగపడుతుందన్నారు. చుక్కా రామయ్య గొప్ప ఉపాధ్యాయుడు, విద్యావేత్త, రాజకీయ నాయకుడుగా ఆదర్శవంతుడని కొనియాడారు. గురువు లేకుంటే గూగుల్ లోకి కూడా పోలేమని వెంకయ్యనాయుడు అన్నారు.

తాను చుక్కా రామయ్యకు ఏకలవ్య శిష్యున్ని అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. విద్యావ్యవస్థలో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని కొనియాడారు. మొదటి పాఠం పుస్తకం ప్రతి ఉపాధ్యాయుని చేతిలో ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేశవరావు, మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సీనియర్ జర్నలిస్టులు, విద్యావేత్తలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.