ఉచితంగా చేపపిల్లల పంపిణీ దేశంలోనే తొలిసారి

రాష్ట్రంలో రెండు మత్స్య కళాశాలలు నెలకొల్పేందుకు ఆదేశాలిచ్చామని పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మత్స్య కళాశాలల ఏర్పాటు, ప్రవేశాల ప్రక్రియ, మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో వనపర్తి జిల్లా పెబ్బేరులో, కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాం వద్ద మత్స్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. చేపల పెంపకంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పెబ్బేరు కళాశాలలో అమ్మాయిలు, అబ్బాయిలకు ప్రవేశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఫిషరీస్ కాలేజీల్లో ఎంసెట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తామన్నారు.

గంగపుత్రులు, ముదిరాజ్‌ల సంక్షేమం కోసమే చేపల పెంపకం చేపట్టామని మంత్రి తలసాని తెలిపారు. కుంటలు, చెరువులతో పాటు అన్ని రిజర్వాయర్లలో 45 కోట్ల చేప పిల్లలను వదిలామని గుర్తు చేశారు. చేప పిల్లలను అందరికీ ఉచితంగా ఇచ్చామని పేర్కొన్నారు. నాగార్జునసాగర్, కోయిల్‌ సాగర్, అల్లీసాగర్, సింగూరు, హుస్నాబాద్ వంటి ప్రాంతాల్లో కేజ్ కల్చర్ అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది రొయ్య పిల్లల పెంపకాన్ని చేపట్టామని తెలిపారు. ముదిరాజ్, గంగపుత్రుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని వివరించారు.  మత్స్య పరిశ్రమ అభివృద్ధికి రూ. 1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని వెల్లడించారు.