ఇవాళే మెట్రో రైలు ప్రారంభోత్సవం

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభానికి ప్రధాని మోడీ వస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. మియాపూర్ మెట్రో రైల్ స్టేషన్ లో ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ పరిశీలించారు.  ప్రధాని మోడీ రాక నేపథ్యంలో ఎస్పీజీ సూచనల మేరకు  భారీ భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మెట్రో రైల్  ప్రాజెక్ట్ మొత్తం పూర్తయితే రోజుకు 15 నుంచి 17 లక్షల మంది ప్రయాణం చేయవచ్చని మంత్రి కేటీఆర్ చెప్పారు.

మెట్రో రైల్ కోసం హైదరాబాదీలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. నగరవాసులకు బుధవారం నుంచి మెట్రో రైల్ అందుబాటులో ఉంటుందన్నారు.  అటు మెట్రోపై విపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో  రూ. 12674 కోట్ల వ్యయంతో నిర్మించిన మెట్రో రైల్‌.. మొదటగా నాగోలు  నుంచి మియాపూర్‌ వరకు నిర్మించిన  30 కిలోమీటర్ల మేర ప్రయాణికులను  గమ్యస్థానానికి చేరుస్తుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా  బహుళ ప్రయోజనకరంగా నిర్మించిన ఓపెన్ స్టేషన్లు.. ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థలతో అనుసంధానం కావడం మన మెట్రో కు ఉన్న ప్రత్యేకత.   మెట్రో రైల్ ప్రారంభానికి సర్వం సిద్ధం కావటంతో హైదరాబాద్ అంతటా పండుగ వాతావరణం నెలకొంది. చిరకాల స్వప్నం సాకారమవుతుండటంతో  హైదరాబాదీలు హర్తం వ్యక్తం చేస్తున్నారు.