ఇవాంక పర్యటన నేపథ్యంలో హై అలర్ట్

హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుపై అమెరికా రక్షణ సంస్థలతో పాటు జాతీయ, రాష్ట్ర సెక్యూరిటీ సంస్థలు డేగకండ్లతో నిఘా పెట్టాయి. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకతో పాటు 150 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు పాల్గొంటుండటంతో తెలంగాణ పోలీస్ ఐదంచెలతో అత్యంత పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సదస్సు ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వస్తుండడంతో ఆయన భద్రతకు సంబంధించి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ తనదైన ప్రత్యేక రక్షణ వలయాన్ని ప్రధాని కోసం సిద్ధం చేసింది. ఎస్పీజీ, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు సోమవారం ప్రత్యేకంగా సమావేశమై సదస్సు భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

ఇవాంక ట్రంప్ పర్యటన హైదరాబాద్‌లో ముగిసేవరకూ ఆమె భద్రత వ్యవహారాలను అమెరికా రక్షణ సంస్థలే పూర్తిగా పర్యవేక్షిస్తాయి. ఇవాంక చుట్టూ రెండంచెల్లో అమెరికా భద్రత అధికారులు ఉంటారు. మూడో వలయంలో ఎస్పీజీ అధికారులు, నాలుగు, ఐదో వలయాల్లో తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లోని కౌంటర్ టెర్రర్ ఆపరేషన్‌లలో శిక్షణ పొందిన సిబ్బంది, సైబరాబాద్ పోలీసులు ఇవాంకకు రక్షణ కల్పించనున్నారు.

జీఈఎస్‌కు సైబరాబాద్ పోలీసులు సూటు, బూటుతో పహారా కాస్తారు. హెచ్‌ఐసీసీ ఆడిటోరియంలో 30 నుంచి 40 మంది వరకు సాధారణ యూనిఫాం కాకుండా బ్లేజర్, సూట్ ధరిస్తారు. ఆయుధాలు బయటికి కనపడకుండా బందోబస్తు నిర్వహించనున్నారు. ఐదెంచల భద్రతా వలయంలో ఈ ప్రత్యేక డ్రెస్‌కోడ్ ఉన్న కాప్స్ మాత్రమే హెచ్‌ఐసీసీ ప్రాంగణంతో పాటు ఆడిటోరియంలో ఉంటారు. మిగతా పోలీసులు అమెరికా సీక్రెట్ సర్వీసెస్, ఎఫ్‌బీఐ, ఎస్పీజీ సిబ్బంది ఆధీనంలో ఉన్న పరిసరాలకు అవతల మాత్రమే రక్షణ బాధ్యతలు నిర్వహిస్తారు.

ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన వివరాలను అమెరికా నిఘా వర్గాలు అత్యంత గోప్యంగా ఉంచాయి. రాజధానిలో ఆమె రక్షణ అంతా సీఐఏ పర్యవేక్షణలో జరుగనున్నది. సదస్సు ప్రాంగణంలోకి ఆయుధాలతో ప్రవేశించడాన్ని ఇవాంక భద్రతా బలగాలు ఇప్పటికే నిషేధించాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి యూఎస్ సెక్యూరిటీ ఫోర్స్ ఓ లేఖ రాసింది. ప్రధాని వెంట ఉండే ఎస్పీజీని అనుమతించే విషయంలో కూడా ఆంక్షలు విధించారు. ఆమెను అధికారిక హోదాలో రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్‌పోర్టుకు కూడా ఎవరూ రావొద్దని అగ్రరాజ్యం భద్రతా అధికారుల ఆంక్షలు విధించినట్లు తెలుస్తున్నది. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విందులో సైతం ఎవరెవరు పాల్గొనాలనేది అమెరికా నిఘా వర్గాల సూచన ప్రకారమే నిర్ణయించనున్నారు.

అటు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు ఏర్పాట్లు అద్భుతంగా సాగుతున్నాయి. సదస్సును విజయవంతం చేసేందుకు ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఎనిమిది కమిటీలు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పని చేస్తున్నాయి. ఆయా శాఖల ఉన్నతాధికారులు కమిటీలకు సారథ్యం వహించనున్నారు. భద్రత, ప్రొటోకాల్, రవాణా, నగర సుందరీకరణలాంటి కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతినిధులు హైదరాబాద్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులందరికీ ప్రత్యేకంగా ఒక కిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించనున్నారు. ఇందులో పోచంపల్లి స్కార్ఫ్‌ తో పాటు టీఎస్‌ఐపాస్ పాలసీ, హైదరాబాద్ ప్రత్యేకత, చరిత్ర, రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల వివరాలు ఉండనున్నాయి. వీటితో పాటు నీతి అయోగ్ అధికారులు భారతదేశానికి సంబంధించిన చరిత్ర, పారిశ్రామికవిధానం, విదేశీయులకు పెట్టుబడులకు అవకాశాలు తదితర సమాచారంతో బ్యాగ్ అందజేయనున్నారు. రాష్ట్ర హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులు, పరికరాలతో గోల్కొండ కోటలో ప్రదర్శన ఏర్పాటు చేస్తారు.

హైటెక్స్ ప్రాంతంలో మొత్తం తొమ్మిది ప్రముఖ హోటళ్లు, ఇతర ప్రాంతాల్లో మరో 22 వరకు ప్రముఖ హోటళ్లలో ప్రతినిధులు బస చేయనున్నారు. వీరు హైదరాబాద్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు భద్రత, ఇతర సమాచారం, సహకారం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధులకు ఆహ్వానం పలుకడానికి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతినిధులను ఆర్టీసీ ఏర్పాటు చేసే బస్సుల్లో వారు బస చేసే హోటళ్లకు తీసుకెళ్తారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు సేవలందించేందుకు 300 మంది వరకు వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులను వలంటీర్లుగా నియమించారు. వీరికి ఇప్పటికే నాలుగు విడుతలుగా శిక్షణ ఇచ్చారు. ప్రతిభ, ఆంగ్లంలో స్పష్టంగా మాట్లాడగలిగే వారిని ఎంపిక చేశారు.