ఇవాంక చుట్టు ఉపగ్రహ నిఘా ఏర్పాటు

ఇవాంక ట్రంప్‌ భద్రతపై అమెరికా అధికారులు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఐదంచెల రక్షణ వలయం ఏర్పాటు చేయడంతోపాటు.. హైదరాబాద్‌లో అడుగుపెట్టినప్పట్నుంచి తిరిగి అమెరికా వెళ్లేంత వరకూ ఆమె భద్రతను అక్కడి నుంచే పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం ఉపగ్రహ నిఘాను వినియోగిస్తున్నారు. ఇది వరకు మాజీ అధ్యక్షుడు జార్జిబుష్‌ వచ్చినప్పుడూ అమెరికన్‌ సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు అక్కడి నుంచే ఉపగ్రహ వీక్షణ ద్వారా భద్రతను పర్యవేక్షించారు. ఇప్పటి  ఇవాంక పర్యటనలో దానికి ఎన్నోరెట్లు మెరుగైన అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాంక కదలికలను నిరంతరం గమనించి రక్షించేందుకు 60 మంది అధికారులతో మూడు వేర్వేరు బృందాలు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నాయి.

ఇవాంకా ట్రంప్‌ భద్రత తొలి అంచె మూడు మీటర్ల దూరం నుంచి మొదలవుతుంది. ఈ వలయంలోని  భద్రత అధికారులు అనూహ్యంగా ఏదైనా ఘటన జరిగినప్పుడు మెరుపు వేగంతో స్పందించి పరిస్థితులను అదుపులోకి తీసుకుంటారు. గెరిల్లా యుద్ధ విద్యల్లో సుక్షితులైన వారు ఈ వలయంలో ఉంటారు. ఇక ఐదు మీటర్ల పరిధిలో మరో భద్రత వలయం ఉంటుంది. ఈ వలయంలోకి ముందస్తు అనుమతి లేకుండా ఎవరినీ రానివ్వరు. క్లోజ్‌ ప్రాక్సిమిటీ టీమ్‌ గా అభివర్ణించే ఈ బృందంలో వీరితో పాటు కేంద్ర పారామిలటరీ విభాగం అధికారులు సంయుక్తంగా భద్రతను పర్యవేక్షిస్తారు. వీరి లోదుస్తుల్లో స్నైపర్‌ వంటి అత్యాధునిక ఆయుధాలుంటాయి.

ముప్పై అడుగుల వలయంలో అమెరికా అధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులు సదస్సులు, సమావేశాల్లో పాల్గొనే ప్రాంతంలో ఈ భద్రత వలయం ఉంటుంది. సమావేశాల్లో పాల్గొనే వారిని గమనిస్తూ ఉంటారు. దాదాపు ప్రతి ఒక్కరి రాకపోకలను క్షుణ్నంగా  పరిశీలిస్తుంటారు. గుర్తింపు కార్డులు లేని, చివరి నిముషంలో లోపలికి వెళ్లే వారిని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించరు. నాలుగో అంచె భద్రతలో భాగంగా ఇవాంకాకు వంద మీటర్ల పరిధిలో 15 మందితో కూడిన భద్రత వలయం విధులు నిర్వహిస్తుంటుంది. వీరు వేర్వేరు ప్రాంతాల్లో ఉండి వాహనాల రాకపోకలు, అపరిచితులపై దృష్టి కేంద్రీకరిస్తారు. సదస్సు, సమావేశాలకు వందమీటర్ల దూరంలో ఏవైనా కొత్త వాహనాలు కనిపించినా, డ్రైవర్లు వేగంగా వెళ్లేందుకు ప్రయత్నించినా గుర్తించి అదుపులోకి తీసుకుంటారు.

  చివరిదైన ఐదో అంచెలో అమెరికన్‌ సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు భద్రతా వ్యూహాన్ని ఐదువందల మీటర్ల దూరం నుంచి అమలు చేస్తారు. అమెరికాలో ఉంటూ ఉపగ్రహం ద్వారా ఇవాంక చుట్టూ ఉన్న పరిసరాలను గమనించే సిబ్బంది.. ఎప్పటికప్పుడు ఈ భద్రతా వలయం అధికారులతో మాట్లాడుతుంటారు. వారు చిత్రీకరించిన దృశ్యాలను ఇక్కడికి పంపుతారు. వాటిని చూసేందుకు వీలుగా ఏఎస్ఎస్ అధికారులు ట్యాబ్‌లను వినియోగిస్తారు.