ఇరాన్- ఇరాక్ బార్డర్ లో భారీ భూకంపం

 

ఇరాన్‌ – ఇరాక్‌ బార్డర్‌ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌ పై  భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. భూప్రకంపనల ధాటికి హలబ్జా నగరంలో129  మందికి పైగా మృతి చెందారు. 3 వందల మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అటు తూర్పు ఇరాక్‌ ప్రాంతంలోని దర్బందికన్‌ పట్టణంలో నలుగురు చనిపోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వందలాది ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, అపార్ట్ మెంట్లు కుప్పకూలడంతో..శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అటు కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బతింది. దీంతో తమ వారి క్షేమ సమాచారం కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.  క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. అటు భూకంపం ధాటికి భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇరాక్ స్టేట్‌ ప్రజలు భవనాలకు దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పాకిస్థాన్‌, లెబనాన్‌, కువైట్‌, టర్కీలలో కూడా స్వల్పంగా భూమి కంపించినట్లు సమాచారం.