ఇతర మెట్రోలతో పోల్చితే మన మెట్రో చౌకే

మెట్రోరైలులో ప్రయాణించేందుకు కిలోమీటర్‌కు సగటున మనం చెల్లించనున్న చార్జీ కేవలం రెండు రూపాయలు మాత్రమే. మొదటిదశ కింద ప్రారంభం కానున్న నాగోల్-మియాపూర్ మార్గం మొత్తం దూరం 30 కిలోమీటర్లు. గరిష్ఠ చార్జీ 60 రూపాయలు. కాబట్టి ఒక్కో కిలోమీటర్‌కు సగటున 2 రూపాయల వ్యయం అవుతున్నది. అంటే 2 రూపాయలు చెల్లిస్తే చాలు ట్రాఫిక్ చిక్కులు లేని ఏసీ ప్రయాణం మన సొంతం కాబోతున్నది.

దేశంలో ప్రస్తుతం తొమ్మిది నగరాల్లో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ఆయా మెట్రోల కనిష్ఠ, గరిష్ఠ ధరలతో పోల్చితే హైదరాబాద్ మెట్రోరైలు టికెట్ల ధరలు అందుబాటులోనే ఉన్నాయి. మిగతా మెట్రోల్లో కిలో మీటర్ దూరానికి సగటున వసూలు చేసే చార్జీలతో పోల్చినప్పుడు ఆరు మెట్రోరైళ్లలో మనకన్నా ఎక్కువ చార్జీలున్నాయి. బెంగళూరు, గుర్గావ్, ముంబై, జైపూర్, కొచ్చి, లక్నో మెట్రో ధరలు మనకన్నా ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై మాత్రమే మనకంటే తక్కువగా ఉన్నాయి.

మన దేశంలోనే ఖరీదైన మెట్రో ప్రయాణంగా ముంబై నిలుస్తున్నది. ఈ మెట్రోరైలులో ఒక కిలోమీటర్ ప్రయాణించాలంటే మూడున్నర రూపాయలు చెల్లించాల్సిందే. 11.4 కిలోమీటర్ల మేర ఉన్న మార్గంలో ఒకవైపు పూర్తి ప్రయాణానికి 40రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. చార్జీల్లో రెండోస్థానంలో గుర్గావ్ ఉన్నది. 11.7 కిలోమీటర్ల మార్గంలో కిలోమీటర్‌కు రెండు రూపాలయల 99 పైసలు చెల్లించాల్సి వస్తున్నది. కొచ్చి మెట్రోలో కిలోమీటర్‌కు 2 రూపాయల 98 పైసలు వసూలు చేస్తూ మూడో స్థానంలో ఉన్నది. మనకు అతి చేరువలో ఉన్న బెంగళూరు మెట్రో సైతం మనకంటే ఎక్కువే చార్జీ వసూలు చేస్తున్నది. 24.2 కిలోమీటర్ల దూరానికి 60 రూపాయలు వసూలు చేస్తున్నది. అంటే ఒకో కిలోమీటర్ కు సగటున 2 రూపాయల 47 పైసలు ఛార్జీ అయితోంది.

దేశంలో తొలి మెట్రోగా రికార్డు సాధించిన కోల్‌కతా మెట్రో టికెట్ల ధరలోనూ రికార్డులు సాధిస్తున్నది. ఇక్కడ ఒక కిలోమీటర్ ప్రయాణానికయ్యే సగటు ఖర్చు కేవలం 91 పైసలు మాత్రమే. అందుకే ఇది ప్రజల మన్ననలు పొందింది. 27.22 కిలోమీటర్ల మేర విస్తరించిన కోల్‌ కతా మెట్రోలో ప్రతిరోజు 6.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. రద్దీలో ఢిల్లీ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. దేశంలోనే అతిపెద్దదైన ఢిల్లీ మెట్రో ప్రయాణ ధర కిలోమీటర్ కు సగటున కేవలం రూపాయి 20 పైసలు మాత్రమే వసూలు చేస్తోంది.