ఇంజినీరింగ్ విద్యను గాడిలో పెట్టినం

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్య గాడిన పడిందని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. నాణ్యమైన ఇంజినీరింగ్ విద్యను అందిస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ర్టాలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులకు మైగ్రేషన్ సర్టిఫికెట్లు ఇచ్చామని వివరించారు. రాష్ట్రంలోని విద్యార్థులు జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలు రాస్తున్నారని, ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి సంస్థల్లో ప్రవేశాలు పొంది ఇతర రాష్ర్టాలకు వెళ్తున్నారని తెలిపారు. వైద్య, వ్యవసాయ విద్యాసంస్థలు రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇక్కడ అవకాశాలు రాని విద్యార్థులు ఇతర రాష్ర్టాలకు వెళ్తున్నారని వెల్లడించారు. కొన్ని ప్రత్యేక విద్యాసంస్థల్లో నేరుగా వెళ్లి ప్రవేశాలు పొందుతున్నారని చెప్పారు. ఇతర రాష్ర్టాల నుంచి కూడా వచ్చి తెలంగాణలో చదువుతున్నారని గుర్తు చేశారు. నాణ్యమైన విద్య అందించడం వల్ల ఇతర రాష్ర్టాల నుంచి విద్యార్థులు వస్తున్నారని కడియం శ్రీహరి పేర్కొన్నారు.