ఇంజినీరింగ్ అత్యద్భుతం టి హబ్-2

అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణాలకు హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. ప్రపంచ పటంలో హైదరాబాద్‌ స్థానాన్ని పదిలం చేసేందుకు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పటిష్ఠ చర్యలు చేపడుతోంది. తెలంగాణ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ హబ్‌ నిర్మాణాన్ని విదేశాల్లోని పలు భవనాలకు ఏ మాత్రం తీసిపోకుండా చేపడుతోంది. పనులను శరవేగంగా పూర్తి చేస్తూ త్వరలోనే ఇంజినీరింగ్‌ అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు అంతా రెడీ చేస్తోంది.

సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, దుబాయి, సౌదీ అరేబియా తరహాలో భారత్‌లో ప్రపంచ ప్రసిద్ధిపొందిన ఆధునిక నిర్మాణాలు లేనిలోటును తెలంగాణ రాష్ట్రం పూడ్చబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల నమూనాలు, నిర్మాణాలు హైదరాబాద్‌లోనూ ఇకపై దర్శనమివ్వనున్నాయి. ఇప్పటికే పోలీసు కమాండ్ కంట్రోల్ టవర్స్, టీ హబ్-2 వంటి ప్రాజెక్టులు అద్భుత నిర్మాణాల జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. ఇంజినీరింగ్ అద్భుత నిర్మాణంగా టీ హబ్-2 పేరుగాంచింది. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో నిర్మిస్తున్న టీ హబ్ ఫేజ్-2 నిర్మాణం దాదాపు 50 శాతం పూర్తి కావచ్చింది. నాలుగు ప్రధాన పిల్లర్ల మీద 35 మీటర్ల కాంటిలెవర్ ప్రాజెక్టు ఓ ఇంజినీరింగ్ అత్యద్భుతంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఎవర్‌ సెండై కంపెనీ ఫ్యాబ్రికేషన్ తయారీ, స్పేస్ ఫామ్ జేవీకి చెందిన ఆర్కిటెక్ట్ పర్యవేక్షణలో కేపీసీ ప్రాజెక్టు లిమిటెడ్, ధృమతారు కన్సల్టెంట్ అనే కంపెనీలు నిర్మిస్తున్నాయి. రూ.406 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రభుత్వం టీ హబ్ ఫేజ్ 2 నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నది. అందుకే ఢిల్లీ టెక్నికల్ ప్రాజెక్టు కన్సల్టెంట్ ద్వారా స్ట్రక్చరల్ కన్సల్టెన్సీ డ్రాయింగ్ చేయించింది. ఇమేజ్‌ టవర్‌ను రూపొందించిన ప్రముఖ ఆర్కిటెక్ట్ అమృత్‌పాల్ చేతుల్లో రూపుదిద్దుకున్నది. ఐఐటీ రూర్కీ శాస్త్రవేత్త భూపేంద్రసింగ్‌తో స్క్రూట్నీ చేయించారు. జేఎన్టీయూ మాజీ వీసీ రమణారావు సలహాలతో రూపొందిస్తున్నారు.

ప్రాజెక్టు సైట్‌లోనే 30 మంది ఇంజినీర్లు పని చేస్తున్నారు. మలేషియాలో ఫ్యాబ్రికేషన్‌తో రూపొందించిన విధానాన్నే అనుసరిస్తున్నారు. తమిళనాడులోని తిరుచ్చిలో ఈ ఫ్యాబ్రికేషన్ పనులు చేస్తున్నారు. అక్కడ 100 మంది ఇంజినీర్లు పని చేస్తున్నారు. ఇప్పటికే 2.50 లక్షల చదరపు అడుగుల పని పూర్తయ్యింది. మంత్రి కేటీఆర్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటున్నది. దుబాయి, అబుదాబి, సింగపూర్, సౌదీ అరేబియా, మలేషియా, థాయిలాండ్, ఖతార్, శ్రీలంక తదితర 16 దేశాల్లో అనేక ప్రాజెక్టులను నిర్మించిన ఎవర్‌ సెండై కంపెనీ తయారుచేసిన ఫ్యాబ్రికేషన్ మెటీరియల్‌ను టీ హబ్ ఫేజ్-2లో వినియోగిస్తున్నారు.

టీ ఆకారంలో నాలుగు కోర్ వాల్స్‌పైన 35 మీటర్ల కాంటిలెవర్‌తో భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్లగ్ అండ్ ప్లే విధానానికి అవసరమైన సకల సదుపాయాలుండనున్నాయి. రెండు బేస్‌మెంట్లతో పాటు, జీ+9 అంతస్తులతో భవనాన్ని నిర్మిస్తున్నారు. 5 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియా కాగా.. పార్కింగ్ ఏరియా 2 లక్షల చదరపు అడుగులు. ఏకకాలంలో 3 వేలమంది కూర్చునేందుకు వీలుగా డిజైన్‌ చేశారు అధికారులు. పనిచేసే ఉద్యోగులందరికీ అన్నిరకాల సదుపాయాలతో పాటు.. ఉష్ణోగ్రతలను 10 డిగ్రీల మేరకు తగ్గించగల సాంకేతిక నైపుణ్యాన్ని ప్రవేశపెడుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అగ్నిమాపక నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక నీటి సరఫరా వ్యవస్థ, జీరో డిశ్చార్జి రీసైక్లింగ్ విధానంతో ఎస్టీపీ ఏర్పాటు చేయనున్నారు. ఇక అన్ని అంతస్తుల్లోనూ ఏటీఎంలు ఏర్పాటు చేయనుండగా.. పర్యావరణహితంగా ఉండే గోడలతో భవనం నిర్మితమవుతోంది.