ఆరుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బందిపొరాలోని హజిన్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిని లష్కరే తోయిబా ఉగ్రవాదులుగా గుర్తించారు. హతమైన వారిలో లష్కరే తోయిబా నాయకుడు, ముంబై దాడుల సూత్రధారి లఖ్వీ మేనల్లుడు కూడా ఉన్నాడు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గార్డ్ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. హజిన్ ప్రాంతంలో  ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో కార్డన్ సెర్చ్ ప్రారంభించిన బలగాలపై… ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య రెండు గంటలకు పైగా కాల్పులు కొనసాగాయి. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. టూజీ, త్రీజీ, ఫోర్ జీ సర్వీసులన్నీ నిలిపివేశారు.