ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తున్న చలిపులి

చలి కాలం ఆరంభంలోనే ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. వారం రోజుల వ్యవధిలోనే ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు పడిపోవడంతో జనమంతా గజగజ వణికిపోతున్నారు. ఉదయం పూట ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. భౌగోళిక పరిస్థితులు, అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో పాటు.. ఉత్తర భారత దేశం నుంచి వచ్చే చలి గాలుల తాకిడితో జిల్లా అంతా చలి పెరుగుతోంది.. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్లే వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

ఇక చలి ప్రభావంతో  రోడ్లన్ని పొగమంచు కమ్ముకుంటున్నాయి. దీంతో వాహనదారులు సైతం తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నారు. ఉదయం పూట రోడ్లన్ని మంచు తో కప్పుకుపోవడంతో  వీధులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.

ఇక చలి నుంచి రక్షణ పొందేందుకు ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తప్పని సరిగా బయటకువెళ్లేవారు  స్వెట్టర్లు. మంకీ క్యాప్లు, షాలువాలు లేనిదే బయటకు రావడం లేదు. చలి, పొగమంచుతో చిన్నారులు స్కూళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు..రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జిల్లా వాసులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.