అసెంబ్లీ రేపటికి వాయిదా

రాష్ట్ర అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ సాయంత్రం 5.10 గంటల వరకు సుదీర్ఘంగా సాగింది. ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. వివిధ అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు వివరంగా సమాధానం చెప్పారు. 11.30 నుంచి 12 గంటల వరకు జీరో అవర్ కొనసాగింది. తర్వాత మాజీ ఎమ్మెల్యేలు దేశిని చినమల్లయ్య, రాజేశ్వరరావు మృతికి సభ సంతాపం తెలిపింది. అనంతరం అరగంట టీ విరామం ప్రకటించారు.

మధ్యాహ్నం 12.30కి తిరిగి సభ ప్రారంభం కాగానే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ సమస్యపై లఘు చర్చ ప్రారంభించారు. చర్చకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సమాధానం చెప్పారు. అనంతరం తెలంగాణ వ్యాట్ చట్టం సవరణ బిల్లులు రెండింటిని సీఎం కేసీఆర్ తరఫున డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత తెలంగాణ ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లుని మంత్రి పద్మారావు ప్రవేశపెట్టారు. చర్చ తర్వాత బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను రేపటికి వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రకటించారు.