అసెంబ్లీ, మండలి రేపటికి వాయిదా

రాష్ట్ర అసెంబ్లీ, మండలి సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు వివరింగా సమాధానాలు చెప్పారు. అనంతరం జీరో అవర్ లో సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత 15 నిమిషాలు టీ విరామం ప్రకటించారు.

సభ తిరిగి ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో గురుకుల విద్యాలయాల ఏర్పాటుపై లఘు చర్చ జరిగింది. అది ముగిసిన తర్వాత మూడు బిల్లులను సభ ఆమోదించింది. ఉర్దూని రాష్ట్రంలో రెండో అధికార భాషగా గుర్తించే తెలంగాణ అధికార భాషా చట్టం సవరణ బిల్లు, తెలంగాణ లోకాయుక్త చట్టం సవరణ బిల్లులను సీఎం కేసీఆర్ తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ ధార్మిక, హిందూ మతసంస్థల చట్టం సవరణ బిల్లుని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. మూడు బిల్లులపై సభ్యులు చర్చించి, ఆమోదం తెలిపారు. ఆ తర్వాత సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రకటించారు.

అటు శాసనమండలిలో కూడా చైర్మన్ స్వామిగౌడ్ ఉదయం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పారు. టీ విరామం తర్వాత రాష్ట్రంలో గురుకుల విద్యాలయాల ఏర్పాటుపై సభలో లఘు చర్చ జరిగింది. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు.