అసెంబ్లీ, మండలి రేపటికి వాయిదా

రాష్ట్ర శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అసెంబ్లీలో ఉదయం ప్రశ్నోత్తరాలను స్పీకర్ మధుసూదనాచారి చేపట్టారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పారు. తర్వాత జీరో అవర్ లో పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రశ్నలు వేశారు. అనంతరం సీఎం కేసీఆర్ తరఫున తెలంగాణ అధికార భాష, లోకాయుక్త చట్టాల సవరణ బిల్లులని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత స్పీకర్ టీ విరామం ప్రకటించారు. విరామం తర్వాత విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ పై లఘు చర్చను స్పీకర్ మధుసూదనాచారి ప్రారంభించారు. అన్ని పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చర్చకు సమాధానం చెప్పారు. ఆ తర్వాత ధార్మిక మరియు హిందూ మతసంస్థల చట్ట సవరణ బిల్లుని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రకటించారు.

అటు మండలిలో కూడా ఉదయం ప్రశ్నోత్తరాలను చైర్మన్ స్వామిగౌడ్ చేపట్టారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పారు. నిన్న అసెంబ్లీలో ఆమోదించిన తెలంగాణ వ్యాట్ చట్టం సవరణ-2017, వ్యాట్ చట్టం రెండో సవరణ, తెలంగాణ ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లులకు మండలి ఆమోదం తెలిపింది. వ్యాట్ సవరణ బిల్లులను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎక్సైజ్ సవరణ బిల్లును మంత్రి పద్మారావు మండలిలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత లఘు చర్చ జరిగింది. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రకటించారు.