అమృత పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్ట్

తమిళనాడు దివంగత సీఎం జయలలిత కుమార్తెను అని పేర్కొంటున్న బెంగళూరు మహిళ దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బెంగళూరుకు చెందిన 37ఏళ్ల అమృత అలియాస్‌ మంజుల అనే మహిళ తాను జయలలిత కుమార్తెనని ఇటీవల ప్రకటించారు. ఇది నిరూపించుకోవడానికి డి.ఎన్‌.ఎ పరీక్షకు అనుమతినివ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఐతే, ఇందుకు న్యాయస్థానం నిరాకరించింది. పిటిషన్‌పై తాము జోక్యం చేసుకోబోమని.. దీనిపై కర్ణాటక హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌ కు సూచించారు. తాను జయలలిత కుమార్తెనని.. పుట్టినప్పుడే తనను జయలలిత సోదరికి ఇచ్చేశారని మంజుల చెబుతున్నారు. జయలలిత మరణించటానికి కొన్ని రోజుల ముందే ఈ విషయం తనకు తెలిసిందన్నారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమెను కలవటానికి తనను అనుమతించలేదని చెప్పారు.