అభివృద్ధి పనుల కోసమే అప్పులు చేస్తున్నాం

తెలంగాణను అన్ని విధాల అభివృద్ధి చేసుకునేందుకే అప్పులు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది అనడం తప్పు అని తేల్చిచెప్పారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

ప్రభుత్వ ప్రాధాన్యాలు మారుతున్నాయి కాబట్టే ప్రభుత్వం అప్పులు తీసుకుంటుందన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు మారాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే రాష్ర్టాలు కానీ, దేశం కానీ అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధి జరగకపోతే.. కరువులు, ఆత్మహత్యలు, అవే ఆకలిచావులు ఉంటాయి తప్ప ఏమీ జరగదన్నారు. తెలంగాణ ప్రజలను ఈ దేశంలో గొప్ప పౌరులుగా, గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. రూ. 40 వేల కోట్ల ఖర్చుతో ఇంటింటికీ మంచినీరు ఇవ్వబోతున్నామని తెలిపారు.

తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని, కేంద్రమంత్రులే ప్రశంసించారని మంత్రి ఈటెల గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడేనాటికి జీఎస్డీపీ ఐదు లక్షలు ఉంటే ఇప్పుడు 7.30 లక్షలు ఉందన్నారు. అప్పులు ఇష్టారీతిన తీసుకునే అధికారం రాష్ర్టాలకు లేదని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం, బ్యాంకులు.. అడగ్గానే అప్పులు ఇవ్వవన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎమ్ పరిమితికి లోబడే అప్పులు ఇస్తాయన్నారు. రెవెన్యూ ఖర్చులు తక్కువ ఉన్న రాష్ట్రాలకే అప్పులు ఇస్తాయని మంత్రి ఈటల స్పష్టం చేశారు. జీడీపీలో 41.11 శాతం అప్పులు చేసిన దేశం భారతదేశమని మంత్రి తెలిపారు. ప్రపంచ దేశాల్లో అప్పులు చేసిన దేశంగా జపాన్ అగ్రస్థానంలో ఉండగా.. అమెరికా, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని ఈటల రాజేందర్ వివరించారు.