అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఐదేళ్ల కిందట నిర్మించిన ‘మనం’ సినిమా సెట్ కాలిపోయింది. భారీగా మంట, పొగ ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల వాళ్లు భయాందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాదం సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్నారు. గంటకుపైగా కష్టపడి మంటలను ఆర్పేశారు.

అగ్నిప్రమాదంపై సినీ నటుడు నాగార్జున స్పందించారు. తమ తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా కావడంతో ‘మనం’ సినిమా సెట్టింగుని ఆయన జ్ఞాపకార్థం అలాగే ఉంచామని నాగార్జున చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, సుమారు రెండు కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వచ్చి మంటలు ఆర్పిన తెలంగాణ ఫైర్ డిపార్టుమెంట్ కు కృతజ్ఞతలు తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణం తెలియాల్సి ఉందన్నారు.