80 శాతం సబ్సిడీతో రుణాలిస్తున్నాం

80 శాతం సబ్సిడీతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాలు ఇస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌. ముద్ర రుణాలపై  హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో జరిగిన అవగాహన కార్యక్రమానికి కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీతో పాటు రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్‌, జూపల్లి కృష్ణారావు, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. లోన్ కోసం వచ్చే ప్రజలను బ్యాంకర్లు ఇంకా సతాయిస్తున్నారని కేంద్రమంత్రి నఖ్వీ విమర్శించారు. మేకిన్‌ ఇండియా సంకల్పంతో మోడి సర్కార్‌ పనిచేస్తోందని చెప్పారు. బలమైన ఆర్ధిక వ్యవస్ధ దిశగా భారత్‌ అడుగులు వేస్తోందన్నారు. బంగారు తెలంగాణలో అందరూ భాగస్వాములు కావాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ సందర్భంగా కొందరికి ముద్ర రుణాల చెక్కులను అందించారు.