నవీపేట, బోధన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

నిజామాబాద్ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కవిత పర్యటించారు. పలుచోట్ల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నవీపేట్ మండల కేంద్రంలో ఏడున్నర కోట్లతో నిర్మించిన పాలిటెక్నిక్ కాలేజీ కొత్త భవనాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే షకీల్‌ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

గత ప్రభుత్వాలు విద్యారంగాన్ని భ్రష్టు పట్టించాయని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. మూడేళ్లలోనే ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.

కవిత ఎంపీ అయిన తర్వాతే పెద్దపల్లి రైల్వే లైన్‌ పూర్తి కావొచ్చిందని మంత్రి పోచారం చెప్పారు. నవీపేటలో రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎంపీ కవిత తెలిపారు.

అనంతరం బోధన్‌లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ భవనాన్ని డిప్యూటీ సీఎం కడియం, మంత్రి పోచారం, ఎంపీ కవిత ప్రారంభించారు. సమైక్య పాలకులు బోధన్‌ అభివృద్ధిని పట్టించుకోలేదని ఎంపీ కవిత మండిపడ్డారు. బోధన్‌ పట్టణాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. రూ.7 కోట్లతో 10 ఎకరాల్లో స్టేడియం నిర్మిస్తామని ప్రకటించారు. ఎకరం స్థలంలో కోటి రూపాయల ఖర్చుతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ కవిత చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఒక యజ్ఞంలా రెసిడెన్షియల్‌ స్కూళ్లను నడిపిస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో పెద్ద సంఖ్యలో మోడల్‌ స్కూళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు.

నవీపేట, బోధన్‌లో కొత్త విద్యా సంస్థలు ప్రారంభం కావడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యారంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.