కొత్త జిల్లాలకు బుధవారంతో ఏడాది పూర్తి

అక్టోబర్ 11వ తేదీ.. కొత్త జిల్లాలకు తొలి బర్త్‌డే. ఈ సందర్భంగా కొత్త జిల్లాలకు ప్రభుత్వం పెద్ద గిఫ్టే ఇస్తున్నది. అద్దె భవనాల్లో, తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవన సముదాయాలు నిర్మిస్తున్నది. ఎల్లుండి 16 జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయ భవన సముదాయాలకు శంకుస్థాపనలు జరుగనున్నాయి. సిద్దిపేట, సిరిసిల్ల, నిర్మల్, జనగామ, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూలు తోపాటు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, జగిత్యాల, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీ కార్యాలయ భవన సముదాయాలకు శంకుస్థాపన చేస్తారు.

సిద్దిపేట, సిరిసిల్ల, నిర్మల్ జిల్లా కేంద్రాల్లో సీఎం కేసీఆర్.. ప్రభుత్వ కార్యాలయ భవన సముదాయాలకు శంకుస్థాపన చేస్తారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు.. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి, ఆయా జిల్లాల్లో పర్యటిస్తారు. సూర్యాపేటలో 12వ తేదీన సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. వాస్తవానికి తొలుత ఇవాళ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో పర్యటించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినప్పటికీ, వాతావరణం అనుకూలించకపోవటంతో పర్యటన వాయిదాపడింది. నారాయణఖేడ్‌లో ఈ నెల 13న పర్యటిస్తారు. 13 జిల్లా కేంద్రాల్లో మంత్రులు ప్రారంభిస్తారు. మిగిలిన జిల్లాల్లో స్థలాల ఎంపిక పూర్తైన తరువాత శంకుస్థాపనలు చేసే అవకాశం ఉన్నది.

అటు 11వ తేదీన సీఎం కేసీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. కలెక్టరేట్ భవన నిర్మాణంతోపాటు, రూ.30 కోట్లతో అపెరల్ పార్కు తోపాటు.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మల్కపేటలో మూడు టీఎంసీల రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేస్తారు. సీఎం పర్యటన సందర్భంగా ఆదివారం మంత్రి కేటీఆర్.. సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ స్థలం, సీఎం సభాస్థలి కోసం స్థలాలను పరిశీలించారు. సభ కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణను ఎంపిక చేశారు. అనంతరం పొదుపు భవనంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేయాలని.. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు సూచించారు. కేసీఆర్ సంకల్ప బలంతోనే రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భవించిందన్నారు మంత్రి కేటీఆర్‌. సీఎం తొలిసారిగా జిల్లాకు వస్తున్న సందర్భంగా కృతజ్ఞత సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రికి ప్రజలు భారీ ఎత్తున స్వాగతం పలికాలని.. సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఇక కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన ప్రజలకు మరింత చేరువైంది. ప్రతి జిల్లా కలెక్టర్ తమ పరిధిలోని 70 శాతం గ్రామాలను పర్యటించినట్టు సమాచారం.  పరిపాలన ప్రజలకు చేరువ కావడంతోపాటు చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ జనంతో మమేకమయ్యేందుకు నేరుగా ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత పరిపాలన ఏవిధంగా ప్రజల వద్దకు చేరింది? సమస్యలు ఏవిధంగా పరిష్కారం అవుతున్నాయి? అధికారుల పనితీరు ఎలా ఉంది? ప్రజాప్రతినిధులు ఏవిధంగా పనిచేస్తున్నారు? పథకాల అమలు తీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నారా? లేదా? ఇలా అనేక విషయాలు ప్రజలను కలిసి తెలుసుకోనున్నారు.