2,718 మంది సింగరేణి బదిలీ వర్కర్లు రెగ్యులరైజ‌్

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. నిన్న (ఆదివారం) సింగరేణి అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షలో ఇచ్చిన ఆదేశాల అమలు ప్రారంభించింది. ఇందులో భాగంగా  2,718 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకటి, రెండు రోజుల్లో ఆయా కార్మికులకు అందుతాయని సింగరేణి సీఎండీ శ్రీధర్ వెల్లడించారు.

జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ అయిన 2,718 మంది కార్మికుల్లో 2416 మంది బదిలీ వర్కర్లు, 299 మంది బదిలీ కోల్ ఫిల్లర్లు, ముగ్గురు టెంపరరీ టన్నెలింగ్ మజ్దూర్లు ఉన్నారు. 2016, డిసెంబర్ 31 నాటికి తగిన హాజరు శాతం ఉన్న కార్మికులకు జనరల్ మజ్దూర్లుగా అవకాశం కల్పిస్తున్నట్టు శ్రీధర్ తెలిపారు.

జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ అయిన వారిలో..

రామగుండం-1 ఏరియాలో 699 మంది

రామగుండం-2 ఏరియాలో 446 మంది

రామగుండం-3 ఏరియాలో 243 మంది

మందమర్రి ఏరియాలో 426 మంది

భూపాలపల్లి ఏరియాలో 330 మంది

శ్రీరాంపూర్ ఏరియాలో 269 మంది

కొత్తగూడెం ఏరియాలో 266 మంది

మణుగూరు ఏరియాలో 26 మంది

బెల్లంపల్లి ఏరియాలో 14 మంది ఉన్నారు.

ఇవేకాక, ఇప్పటి వరకు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న 21 మంది ఉద్యోగులకు జమేదార్లుగా ప్రమోషన్ ఇస్తున్నట్టు సింగరేణి సీఎండీ శ్రీధర్ ప్రకటించారు.

సీఎం కేసీఆర్ సమీక్షలో ఇచ్చిన ఆదేశాల అమలుకు సింగరేణి యాజమాన్యం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. సీఎండీ శ్రీధర్ పర్యవేక్షణలో పర్సనల్, సివిల్, ఎలక్ట్రికల్, మెడికల్ తదితర విభాగాల వారు ఆదివారం రాత్రి నుంచే చర్యలు చేపట్టారు. బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ చేసే ఫైలుని ఒక్కరోజులోనే సిద్ధం చేశారు.

మరోవైపు, సింగరేణి కార్మికులతో సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో నిన్న సమావేశమైన సందర్భంగా వారు దృష్టికి తెచ్చిన సమస్యను వెంటనే పరిష్కరించారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కె.ప్రసన్న సింహ సరిగా స్పందించడం లేదని కార్మికులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఆయన వ్యవహార శైలి బాగాలేదని, అనారోగ్య సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. దీంతో, 24 గంటలు తిరక్కుండానే ప్రసన్న సింహాను బదిలీ చేశారు. ఆయన స్థానంలో రామగుడం ఏరియా ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ మంతా శ్రీనివాస్ ను చీఫ్ మెడికల్ ఆఫీసర్ నియమించారు.