16 నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

సోమవారం నుంచి తెలంగాణలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. సచివాలయంలోని తన చాంబర్ లో మంత్రి హరీశ్ రావు మార్కెటింగ్ కార్యకలాపాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) మేనేజింగ్  డైరెక్టర్ చొక్కలింగంతో ఫోన్ లో మాట్లాడారు. పత్తి కొనుగోలు కేంద్రాలను తెరవడం ఇప్పటికే చాలా ఆలస్యమైందని, వెంటనే సీసీఐ రంగంలోకి దిగాలని మంత్రి కోరారు. ఈ నెల 16 వ తేదీ నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలను సీసీఐ ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తయినట్టు చొక్కలింగం చెప్పారు.

వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి సీసీఐ అంగీకరించినట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. తేమ శాతం 8 కన్నా తక్కువ ఉండేటట్లు చూసుకోవాలని పత్తి రైతులను మంత్రి కోరారు. బాదేపల్లి, గజ్వేల్, ఘణపూర్, జమ్మికుంట, కరీంనగర్, పెద్దపల్లి, పరకాల, వరంగల్ తదితర ప్రాంతాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ.4320 కన్నా తక్కువకు అమ్ముకొని నష్టపోవద్దని మంత్రి హరీశ్ రావు రైతులకు సూచించారు.

తెలంగాణ అంతటా 231 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మార్క్ ఫెడ్ ఎండీ డాక్టర్ జగన్మోహన్ తో మాట్లాడారు. ఇప్పటివరకు 88 వేల క్వింటాళ్ల మక్కలను కొనుగోలు చేశారని, రైతుల అవసరాన్ని బట్టి మరికొన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మార్క్ ఫెడ్ ను  మంత్రి ఆదేశించారు. 1425 రూపాయల క్వింటాల్ మద్దతు ధరతో ఇప్పటివరకు 12 కోట్ల 53 లక్షలు వెచ్చించినట్టు మంత్రి చెప్పారు.

మినుములు, పెసలు, సోయాబీన్ తదితర పంటల దిగుబడులు, వాటి మార్కెటింగ్ సమస్యలను మంత్రి హరీశ్ రావు సమీక్షించారు. పెసలు క్వింటాలుకు 5,575 రూపాయల మద్దతు ధరతో 3 కోట్ల 37 లక్షలు వెచ్చించి 6,060 క్వింటాళ్ళ పెసలు కొనుగోలు చేసినట్టు హరీశ్ రావు చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మినుముల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్క్ ఫెడ్ ను మంత్రి కోరారు. క్వింటాలుకు మద్దతు ధర 5,400 రూపాయలతో ఒక కోటి 96 లక్షలు వెచ్చించి మినుములు కొనుగోలు  చేసినట్టు హరీశ్ రావు తెలిపారు.

సోయాబీన్ రైతుల కోసం 20 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. రైతులకు మద్దతు ధర తక్కువ రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయిల్ ఫెడ్, హాకా, మార్క్ ఫెడ్ సంస్థలను మంత్రి కోరారు.

ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితర అధికారులు పాల్గొన్నారు.