హైదరాబాద్ లో రికార్డు స్ధాయిలో వర్షపాతం నమోదు

హైదరాబాద్ లో ఈ ఏడాది వానలు దంచికొట్టాయి. రెండుమూడేళ్ల నుంచి ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. నైరుతి రుతువపనాల సీజన్ లో సాధారణం కంటే చాలా అధికంగా వానలు కురిసాయి. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనూ అత్యధికంగా వర్షాలు పడ్డాయి.. హైదరాబాద్ జిల్లాలో సాధారణం కంటే 57 శాతం, రంగారెడ్డి జిల్లాలో సగటు కంటే 31 శాతం అధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ ప్రకటించింది.

సాధారణంగా జూన్ 1 నుండి సెప్టెంబర్ 1 వరకు నైరుతి సీజన్ గా పరిగిణిస్తారు. ఈ లోపల నైరుతి ఋతు పవనాలు తిరోగమనం అవుతాయి. కానీ ఈసారి నైరుతి ఋతు పవనాలు గత నెల 12 వ తేదీన రాజస్థాన్ నుంచి తిరోగమనం అయ్యాయి. రాష్ట్రంలో అవి తిరోగమనం కావడానికి మరింత సమయం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరొక వారం రోజులు నైరుతి ఋతు పవనాలు పూర్తి స్థాయి లో నిష్క్రమిస్తాయని తెలిపింది. ఈ లోపల మరోసారి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయంటున్నరు.

హైదరాబాద్ లో ముఖ్యంగా పాత బస్తీలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ జిల్లా సగటు వర్షపాతం 625.2 మిల్లీ మీటర్లకు గాను..983.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సగటున 57శాతం అధికంగా నగరంలో వర్షం కురిసింది. చార్మినార్  ఏరియాలో సగటున 592.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురువాల్సిన వర్షం..దాదాపు 96శాతం అధికంగా పడింది. అంటే 1159.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సైదాబాద్ లో 603.9 మిల్లీ మీటరల సగటు వర్షపాతానికిగాను 1091.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 81శాతం అధికంగా వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు అంబర్ పేట్ లో 647.7 మిల్లీ మీటర్ల సగటుకు 1146.65 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బహదూర్ పురాలో 72శాతం, గోల్కొండ, ఖైరతాబాద్ లో 62 శాతం వర్షపాతం అధికంగా నమోదైంది. బండ్లగూడ, నాంపల్లిలో 60 శాతం, తిరుమలగిరి, ఆసిఫ్ నగర్ లో 52 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. అటు సికింద్రాబాద్, ముషీరాబాద్ లో 48 శాతం, మారేడుపల్లిలో 44శాతం, అమీర్ పేట్ లో 43శాతం అధికంగా వర్షం కురిసింది. హిమాయత్ నగర్ లో 34శాతం అధికంగా కురువగా..నగరంలోనే అతి తక్కువగా షేక్ పేట్ లో ముప్పై శాతం..సగటుకంటే  అధికంగా వర్షపాతం నమోదైంది.

మరోవైపు కూకట్ పల్లిలో సగటు వర్షపాతం622.3 మిల్లీ మీటర్లు కాగా 1113.23 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అంటే 79 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఉప్పల్ లో 73 శాతం, బాల్ నగర్ లో 63 శాతం, అల్వాల్ లో 51 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దాదాపు వెయ్యి మిల్లీ మీటర్లకు మించి కూకట్ పల్లి, ఉప్పల్, బాల్ నగర్, అల్వాల్ లో వర్షం కురిసింది. రాజేంద్రనగర్ లో 46 శాతం, షాబాద్, సరూర్ నగర్  లో 45శాతం, కుత్బుల్లాపూర్ లో 33శాతం అధిక వర్షపాతం రికార్డు అయ్యింది. అతి తక్కువగా మేడ్చల్ లో కేవలం 11శాతం అధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా  జిల్లా సగటు వర్షపాతం 683.5 మిల్లీ మీటర్లు  కాగా.  759.65 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

మరోవైపు రంగారెడ్డి జిల్లాలో సగటున 565.2 మిల్లీ మీటర్ల వర్షం కురువాల్సి ఉండగా.. 31 శాతం అధికంగా వర్షం కురిసింది. 742.6 మిల్లీ మీటర్ల వర్షపాతం జిల్లాలో నమోదైంది. గండిపేట్ లో 45శాతం, హయత్  నగర్ లో 38 శాతం వర్షపాతం రికార్డు అయ్యింది. శేరిలింగంపల్లిలో 40శాతం, అబ్దుల్లాపూర్‌మెట్ లో 33 శాతం, శంకర్ పల్లిలో కేవలం 9 శాతం అధికంగా వర్షం కురిసిందని అధికారులు తెలిపారు.

10 రోజులుగా హైదరాబాద్ మహా నగరంలో కురుస్తున్న భారీవర్షాలతో.. సాధారణం కంటే 57 శాతం అధిక వర్షపాతం రికార్డు అయ్యింది. గత ఏడాది అక్టోబరులో 3.7 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా ఈ 10రోజుల్లోనే రికార్డు స్థాయిలో 21.8 సెం.మీ. నమోదైంది. వర్షాలు ఇలాగే కొనసాగితే ఆల్‌ టైం రికార్డు దాటవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 1916లో  అక్టోబరులో ఆల్‌ టైం రికార్డుగా 1916లో 35.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. తర్వాత, 2013లో 23.9 సెం.మీ పడింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా జూన్‌-సెప్టెంబర్‌  మాన్‌సూన్‌ సీజన్‌ లో భారీవర్షాలు కురిసినా.. తెలంగాణ వ్యాప్తంగా 13 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. పాత పది జిల్లాల్లో 3 జిల్లాల్లో మాత్రమే సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది.