హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లో ఇవాళ కూడా భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలుచోట్ల విడతల వారీగా వాన పడింది. మాదాపూర్‌ లో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అటు పటాన్ చెరు నుంచి మియాపూర్‌, చందానగర్, బీహెచ్‌ఈఎల్‌, కూకట్ పల్లి నుంచి ఇటు సికింద్రాబాద్, వారాసిగూడ, పద్మారావు నగర్, పార్సీగుట్ట, శ్రీనివాస నగర్, సీతాఫల్ మండి వరకు.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేట, పంజాగుట్టతో పాటు పలుచోట్ల వర్షం కురిసింది. దీంతో, రోడ్లపై నీరు నిలిచి చాలాసేపు ట్రాఫిక్ మెల్లిగా సాగింది. నీళ్లు నిలిచినచోట్ల జీహెచ్ఎంసీ సిబ్బంది వెంటనే వాటిని తొలగించేందుకు కృషి చేశారు.

హైదరాబాద్‌ పై క్యుములోనింబస్ మేఘాల ప్రభావం ఉందని, వాటి ప్రభావంతో సాయంత్రం, రాత్రి సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.