హైదరాబాద్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ

ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మాస్యూటికల్ సిటీని హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఫార్మా సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దశల వారీగా ఈ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. ఫార్మాసిటీపై సమగ్ర అధ్యయనం చేశామని, దానికోసం పూర్తిస్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఫార్మా సిటీపై హైదరాబాద్ హైటెక్ సిటీలోని హెచ్‌ఐసీసీలో మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

మందుల తయారీలో మనదేశం పూర్తిస్థాయిలో వెనుకబడి ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. చైనా, యూరప్, అమెరికా నుంచి మందులు దిగుమతి అవుతున్నాయని చెప్పారు. అమెరికాలో మెడిసిన్ తయారీకి అయ్యే ఖర్చు కంటే తక్కువ ధరలో మందులు తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. 84 శాతం మందుల ముడి సరుకు దిగుమతులపైనే మనం ఆధారపడి ఉన్నామని పేర్కొన్నారు. చైనా నుంచి 66 శాతం ముడి సరుకు దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు. మెడిసిన్ దిగుమతులను తగ్గించాలన్నారు. ఇక్కడే మందులు తయారైతే ధరలు తగ్గుతాయని చెప్పారు. దేశీయంగా ఔషధాల తయారీని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అవసరమైన సహకారం ప్రభుత్వం నుంచి లభిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.

ఆరు, ఏడు ప్రాంతాల్లో పారిశ్రామికవాడలు ఉండటం వల్ల డబ్బు అదనంగా ఖర్చు కావడంతో పాటు కాలుష్యం కూడా పెరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఫార్మా కంపెనీలన్నీ ఒకేచోట ఉంటే ఈ సమస్య ఉండదన్నారు. ఫార్మా సిటీ ఏర్పాటుతో కాలుష్యం ఏర్పడుతుందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఫార్మా సిటీ పరిసరాల్లో ఉండే ప్రజలకు కాలుష్యం ముప్పు ఉండదని మంత్రి స్పష్టం చేశారు. అత్యాధునిక వసతులతో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అతి తక్కువ ఖర్చుతోనే హైదరాబాద్ ఫార్మాసిటీలో అన్ని మెడిసిన్స్ లభించేలా ప్రణాళిక చేశామని పేర్కొన్నారు.

గతంలో వివిధ ప్రాంతాల్లో ఫార్మా సిటీలు ఉండటం వల్ల ఔషధాల ఉత్పత్తి వ్యయం పెరిగిందని తెలిపారు కేటీఆర్. ఫలితంగా తక్కువ మోతాదులోనే ఔషధాల ఉత్పత్తి జరిగిందని చెప్పారు. అన్ని ఒకేచోట ఉండేలా ఫార్మా ఇండస్ట్రియల్ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఏక కాలంలో 19,333 ఎకరాల ఫార్మాసిటీ ప్రాజెక్టును చేపట్టడం సాధ్యం కాదన్నారు మంత్రి. దశలవారీగా ఈ ఫార్మా సిటీ ప్రాజెక్టును చేపడుతామని తెలిపారు. 8300 ఎకరాల్లో ఫార్మా సిటీని ప్రారంభించాలని అనుకున్నామని, ఇప్పటివరకు 7 వేల ఎకరాల భూసేకరణ జరిగిందని వెల్లడించారు. 1,300 ఎకరాలకు పర్యావరణ అనుమతులు రావాల్సి ఉందని చెప్పారు.

ఫార్మా సిటీ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా లక్షా 70 వేల మందికి ఉపాధి లభిస్తుందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 లక్షల 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు. వారికి ప్రభుత్వమే శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ఫార్మాసిటీలో పని చేసే వాళ్లంతా అక్కడే నివాసం ఉండబోతున్నారని మంత్రి పేర్కొన్నారు.

ఫార్మా సిటీ పరిధిలో ఉన్న 10 చెరువులను సుందరీకరిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. చెరువులను సంరక్షించే బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. కాలుష్యం గురించి కాంగ్రెస్‌ నేతలు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటదని ఎద్దేవా చేశారు. మిషన్‌భగీరథ ద్వారా వచ్చే నీటిలో 10 శాతం పరిశ్రమలకు ఉపయోగిస్తామని చెప్పారు. చెరువులు, భూగర్భ జలాలను ముట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఫార్మా సిటీలో కామన్‌ ఫ్లూయిడ్‌ సిస్టమ్‌ అమలు చేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు ఫార్మాసిటీకి బౌండరీ నుంచి అర కిలోమీటర్‌ దూరంలో బఫర్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఫార్మా సిటీపై మిడిమిడి జ్ఞానంతో ఆర్టికల్స్‌ రాయొద్దని మీడియాకు సూచించారు. దేశ ప్రయోజనాలు ఈ ప్రాజెక్టులో ఇమిడి ఉన్నాయని, పబ్లిక్‌ హియరింగ్‌ లో అవాంతరాలు సృష్టించొద్దని కోరారు. ఫార్మాసిటీ భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, భూమికి తగిన పరిహారం ఇస్తామన్నారు.