హైదరాబాద్ లో జాతీయ ఆక్వా ఎక్స్ పో

దేశంలో చేపల పెంపకానికి అనుకూల పరిస్థితులున్నప్పటికీ… ఆ స్థాయిలో ఉత్పత్తి జరగడం లేదని మత్స్య శాఖ కమిషనర్ డాక్టర్ సువర్ణ అన్నారు. ఈ రంగంలో ఉండే లాభాలను రైతులకు వివరించి ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్ లో తొలిసారి ఆక్వా ఎక్స్ పో నిర్వహించనున్నారు. చేపల పెంపకంలో అధునాతన పద్ధతులు, సాంకేతికతపై ఈ ఎక్స్ పో లో చర్చించనున్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో ఇవాళ సిఫా సలహా సంఘం సమావేశంలో ఎక్స్ పో కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించారు. మత్స్య పరిశ్రమ-అభివృద్ధి చెందుతున్న తీరుపై చర్చించారు.

దేశ విదేశాలకు చెందిన శాస్త్రవేత్తలతో పాటు… మత్స్య పరిశ్రమపై ఆధారపడిన రైతులు ఈ సదస్సులో పాల్గొంటారని సొసైటీ ఫర్ ఇండియన్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ (సిఫా) సలహా సంఘం ఛైర్మన్ విజయ్ గుప్తా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 160 మిలియన్ టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయని, మరో 15 సంవత్సరాల్లో ఇది రెట్టింపవుతుందని చెప్పారు. వ్యవసాయం, పౌల్ట్రీ, పాడి పరిశ్రమతో పోలిస్తే చేపల పరిశ్రమలో అధిక లాభాలున్నాయని, వీటిని రైతులకు అర్థమయ్యేలా వివరించి ఇందులో ఉండే అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా ఎక్స్ పో ద్వారా ప్రయత్నిస్తామని అన్నారు.