హైదరాబాద్ లో కుండపోత!

గ్రేటర్‌ హైదరాబాద్‌లో వరుణుడు తిష్టవేశాడు. ప్రతి రోజూ సాయంత్రం కాగానే.. భారీ వర్షంతో  హైదరాబాద్‌ తడిసి ముద్దవుతుంది. ఉదయం వేళలో కొంచెం ఎండ వచ్చినా.. సాయంత్రం అయ్యే సరికి నల్లటి మబ్బులు కమ్ముకుని వర్షం కురుస్తోంది. గురువారం సాయంత్రం కూడా హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. అతిభారీ వర్షం వల్ల నీళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో.. లోతట్టు ప్రాంతాలు, అపార్ట్‌మెంట్లు జలమయమయ్యాయి. రోడ్లపై ట్రాఫిక్‌ స్తంభించడంతో.. హైదరాబాదీలు వర్షంలో తడుస్తూ.. పరేషాన్‌ అయ్యారు.

భారీ వర్షాలు కురుస్తుండటంతో.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. జీహెచ్‌ఎంసీ మాన్‌సూన్ యాక్షన్ టీమ్‌లు వెంటనే రంగంలోకి దిగాయి. ముంపు సమస్య ఉన్న ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు ముంపు ప్రాంతాల్లో నీటిని తొలిగించేందుకు మోటర్లను ఏర్పాటు చేశాయి.

ఖైరతాబాద్, శ్రీనగర్ కాలనీ, మైత్రీవనం, ఉప్పల్, మల్కాజిగిరి, అంబర్‌పేట, కాప్రా, చార్మినార్, సరూర్‌నగర్, నారాయణగూడ, ఎల్బీనగర్, ముషీరాబాద్ ఏరియాలలో అధికంగా వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. ఇక నాగమయ్యకుంట, పద్మాకాలనీ, దీప్తిశ్రీ నగర్, నాచారం, మల్కాజిగిరి, కాప్రా తదితర ప్రాంతాలతో పాటు నగరంలోని వివిధ బస్తీల్లో వర్షపు నీరు ఇండ్లలోకి నీరు చేరింది. ఈదురుగాలులు వీయడంతో  కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్టు సీపీడీసీఎల్ అధికారులు తెలిపారు. కాప్రా, మల్కాజిగిరి, నాచారం, ఉప్పల్ ప్రాంతాల్లో నాలాలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

మేయర్ బొంతు రామ్మోహన్ జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూం నుంచి పరిస్థితిని పర్యవేక్షించి.. సహాయక చర్యలను ప్రజలకు అందేలా చర్యలు తీసుకున్నారు. రోడ్లపై నిలిచిన నీటిని సాఫీగా వెళ్లేలా చేయడంతో పాటు పాత భవనాలున్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.