హిమాచల్ ఎన్నికలకు మోగిన నగారా

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. వచ్చే ఏడాది జనవరి 7తో ప్రస్తుత సభ కాలం ముగుస్తుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 9న పోలింగ్ నిర్వహించి, డిసెంబర్ 18న ఫలితాలు విడుదల చేయనున్నారు. హిమాచల్ లో తక్షణం ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని సీఈసీ అచల్ కుమార్ జ్యోతి చెప్పారు. మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్లతో కలిసి ఢిల్లీలో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు.

హిమాచల్ ప్రదేశ్ లో 49.05 లక్షల మంది ఓటర్లు ఉండగా, 7521 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అందరూ మహిళలే నిర్వహించే 136 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు సీఈసీ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో 68 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకోనున్నారు. ఏ పార్టీకి ఓటు వేసింది తెలిపే స్లిప్ వచ్చే వీవీపాట్ యంత్రాలను ఈ ఎన్నికల్లో ఉపయోగిస్తామన్నారు.

గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు ప్రకటిస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఏకే జ్యోతి స్పందించారు. డిసెంబర్ 18లోపు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.