సైబర్ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి

రెండేళ్లలోనే ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పది పాలసీలు తీసుకువచ్చిందని ఐటీ మంత్రి కేటీఆర్ చెప్పారు. దేశానికే తలమానికమైన గ్లోబల్ టెక్నాలజీ లీడర్స్ కంపెనీలైన ఆపిల్, గూగుల్ లాంటి సంస్థలను హైదరాబాద్ కు తీసుకువచ్చామన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీలో ఐ-తెలంగాణ 2017 సదస్సును ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఈ-వేస్ట్ మేనేజ్‌ మెంట్ పాలసీలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ సెక్రటరీ సంజయ్ బారుతో పాటు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సైయెంట్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి,  ఇంటెల్ ఇండియా హెడ్ నివృతి రాయ్ పాల్గొన్నారు.

రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కొత్త టెక్నాలజీలను అమలు పర్చడంలో ముందుంది అని పేర్కొన్నారు. ఐటీ కంపెనీలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టాస్క్, టీ-హబ్ చాలా బాగున్నాయని సైయెంట్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి కొనియాడారు. యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

స్టార్టప్‌ లకు హైదరాబాద్‌ను హబ్‌గా తీర్చిదిద్దామని రాష్ట్ర ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. అంతర్జాతీయ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కావడం గర్వంగా ఉందన్నారు.

దేశంలో 5జీ కనెక్టివిటీ పొందబోతున్న తొలి నగరం హైదరాబాద్ అని ఇంటెల్ ఇండియా హెడ్ నివృతిరాయ్ ప్రకటించారు. ఈజ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో హైదరాబాద్ నెంబర్‌వన్ స్థానంలో ఉందని, అందరం కలిసి హైదరాబాద్‌ ను మెగా సిటీగా తీర్చిదిద్దుదామని చెప్పారు. భారతీయుల జీవన విధానాలు మెరుగుపరిచేందుకు డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించాలని సూచించారు.

టీ-హబ్ సహకారంతో రూపొందించిన స్మార్ట్ వాచ్‌ను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం ఆ వాచ్‌ ను కేటీఆర్ చేతికి పెట్టుకున్నారు. ఇదే వేదికపై తెలంగాణ ప్రభుత్వంతో 5 కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.