సూర్యాపేటకు సీఎం కేసీఆర్ వరాలు

సూర్యాపేట పర్యటన సందర్భంగా జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. పాత నల్గొండ జిల్లాకు అవసరమైతే వెయ్యి కోట్లు అప్పు తెచ్చి అయినా ఇస్తానని అన్నారు. 323 గ్రామ పంచాయతీలలో అభివృద్ధి పనులకు రూ.15 లక్షల చొప్పున, 323 తండాలకు రూ.10 లక్షల చొప్పున నిధులు ఇస్తానని చెప్పారు. వీటికి సంబంధించి రేపే జీవో ఇస్తామన్నారు. సూర్యాపేట పట్టణంలో అభివృద్ధి పనుల కోసం రూ.75 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. వెనుకబడ్డ నల్గొండ, సూర్యాపేటలకు రెండు మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తామని ప్రకటించారు. వచ్చే బడ్జెట్ లోనే వీటికి నిధులు కేటాయిస్తామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎయిమ్స్ వస్తుంది కాబట్టి అక్కడ కూడా మెడికల్ కాలేజీ వస్తుందన్నారు. సూర్యాపేటలో బంజారా భవన్ నిర్మిస్తామని చెప్పారు. మూసి ప్రాజెక్ట్  ఆధునీకరణ పనుల కోసం వెంటనే టెండర్లకు పిలవాలని మంత్రిని ఆదేశించారు. సూర్యాపేటలోని పుల్లారెడ్డి చెరువు అభివృద్ధికి నిధులు ఇస్తామన్నారు.

స్వచ్ఛ మున్సిపాలిటీగా సూర్యాపేటకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన చైర్ పర్సన్ ను ముఖ్యమంత్రి అభినందించారు. సూర్యాపేట పట్టణంతో పాటు జిల్లా అంతటా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటి, వాటిని పెంచాలని సీఎం కేసీఆర్ కోరారు. రెండేళ్ల తర్వాత ఇండ్లు కనిపించనంతగా అవి ఎదగాలని అన్నారు. త్వరలో కోదాడ, నల్గొండ పట్టణాల పర్యటనకు వస్తానని, అప్పుడు సమీక్ష జరుపుకొని హుజూర్ నగర్ తో పాటు వాటికి కూడా నిధులు ప్రకటిస్తానని సీఎం కేసీఆర్ చెప్పారు.