సీతారామ ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు చెందిన భూసేకరణ, అటవీ, పర్యావరణ, వన్య ప్రాణి అనుమతులు, పంప్ హౌజ్ లు, కెనాల్స్, ఇతర పనుల పురోగతిపై హైదరాబాద్ లోని జలసౌధలో ఆయన సమీక్ష నిర్వహించారు.

4000 ఎకరాల అటవీ భూముల సేకరణకు సంబంధించిన అనుమతల కోసం వారం రోజుల్లో కేంద్ర అటవీశాఖకు ప్రతిపాదనలు పంపించాలని మంత్రి హరీశ్ రావు కోరారు. అలాగే ఎకో సెన్సిటివ్ జోన్ లోని 1000 ఎకరాల అనుమతి కోసం పది రోజుల్లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని మంత్రి ఆదేశించారు. ఆయా అనుమతుల కోసం ఢిల్లీలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించి ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు. అటవీ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకొని అటవీ భూముల సేకరణ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

6 లక్షల 74 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతి ఇంకా వేగంగా జరగాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. 3,28,853 ఎకరాలకు కొత్తగా సాగునీటి సౌకర్యం లభిస్తుంది.

ప్యాకేజీల వారీగా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులను మంత్రి హరీశ్ రావు సమీక్షించారు. మొత్తం 8 ప్యాకేజీలలో ప్రస్తుతం 3 ప్యాకేజీల పనులను ప్రారంభించారు. మిగతా 5 ప్యాకేజీల పనులలో ప్యాకేజీ 4,5,6,7 పనులకు అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తయింది. అలాగే ప్యాకేజీ 8 పనులను కూడా సంబంధిత ఏజెన్సీతో అగ్రిమెంట్ పూర్తి చేసి ప్రారంభించాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. మొత్తం 5 పంప్ హౌజ్ లలో ఒక పంప్ హౌజ్ పనులే గ్రౌండ్ అయ్యాయి. మరొక పంప్ హౌజ్ పనులు ప్రారంభం కానున్నాయి. అయితే మిగతా 3 పంప్ హౌజ్ ల పనులను కూడా వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. పంప్ హౌజ్ పనులతో సహా ఇతర అన్ని పనులకు సంబంధించి ఎప్పటిలోగా పూర్తి చేయనున్నారో తేదీల వారీగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించి తనకు తెలియజేయాలని హరీశ్ రావు ఆదేశించారు. ఇకపై రెగ్యులర్ గా సీతారామ ప్రాజెక్టుపై సమీక్ష జరపనున్నట్టు మంత్రి ప్రకటించారు.

సీతారామ ఎత్తిపోతల పథకం కోసం మొత్తం 4,445 ఎకరాల భూసేకరణ జరగవలసి ఉన్నది. ఇందులో 374 ఎకరాల సేకరణే పూర్తయ్యింది. మిగతా భూసేకరణ ప్రక్రియకు టాప్ ప్రయారిటీ ఇచ్చి ఈ పనులు పూర్తయ్యేలా చూడాలని సమీక్షా సమావేశం నుంచే మంత్రి హరీశ్ రావు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా కలెక్టర్లు రాజీవ్ హనుమంతు, లోకేశ్, ఖమ్మం జిల్లా అటవీ ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా 4,900 ఎకరాలను కొత్తగూడెం, జగిత్యాల జిల్లాలలో గుర్తించారు. ప్రత్యామ్నాయ భూములను అటవీ శాఖకు బదలాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని హరీశ్ రావు జగిత్యాల కలెక్టర్ శరత్ ను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టులోని అన్ని ప్యాకేజీలలోనూ యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని హరీశ్ రావు సూచించారు. ఈ ప్రాజెక్టుకు చెందిన అటవీ, పర్యావరణ అనుమతులపై జాప్యం చేయరాదని అన్నారు.

సీతారామ ప్రాజెక్టుకు చెందిన మొదటి దశకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిన విషయాన్ని హరీశ్ రావు గుర్తు చేశారు. మోటార్లు, సివిల్, మెకానికల్ విభాగాలకు చెందిన పెండింగ్ లో ఉన్న డిజైన్లను వెంటనే పూర్తి చేయాలని సి.ఈ. సి.డి.వో ను మంత్రి ఆదేశించారు.

ఈ సమీక్షలో ఇరిగేషన్ ఈ.ఎన్.సి. మురళీధర్ రావు, సీతారామ ప్రాజెక్టు సి.ఈ. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.