సిద్దిపేటకు ఏం చేసినా తక్కువే!

సిద్దిపేటకు తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువేనని సీఎం కేసీఆర్ అన్నారు. తనకు జన్మను, రాజకీయ జన్మను, తెలంగాణ కోసం పోరాడే బలాన్ని, అనర్గళ గళాన్ని ఇచ్చింది సిద్దిపేటేనని కొనియాడారు. తన జన్మభూమి సిద్దిపేటకు శిరస్సు వంచి నమస్కరించారు. సిద్దిపేటకు ఏం చేసినా తక్కువేనన్నారు. తెలంగాణ అభివృద్ధికి తన జన్మస్థలి సిద్దిపేటలో పునరంకితం అవుతున్నానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సిద్దిపేట జిల్లా ఇంటిగ్రెటెడ్ కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

సిద్దిపేట జిల్లా కావాలని 1983లో కరీంనగర్ వెళ్తుండగా ఎన్టీఆర్ కు అంబేద్కర్ విగ్రహం దగ్గర తానే దరఖాస్తు ఇచ్చానని, ఆయన చేయలేదు.. ఆ తర్వాత వచ్చినవాళ్లు కూడా చేయలేదని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఏ రాష్ట్రం చేయని సాహసం చేశానని, 10 జిల్లాలను 31 జిల్లాలుగా ఏర్పాటు చేశామని చెప్పారు. సిద్దిపేట జిల్లా కావాలని ఆనాడు కోరిన తానే ఇప్పుడు జిల్లాను ఏర్పాటు చేసి, ప్రారంభించి, కొత్త కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం తన అదృష్టమన్నారు. రూ.1300 కోట్లు మంజూరు చేసుకొని, కొత్త జిల్లా కేంద్రాల్లో, కూలిపోయే స్థితిలో ఉన్న పాత జిల్లా కేంద్రాల్లో సమీకృత కార్యాలయాలు కడుతున్నామని చెప్పారు. రాష్ట్రం కావాలని కోరుకుని, బతికుండగానే సాధించుకున్నావని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫైలు మీద సంతకం చేసిన ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనను ప్రశంసించారని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.

అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. సొంత వనరులు అభివృద్ధి చేసుకోవడంలో తెలంగాణ నంబర్ వన్ గా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రశంసించిందని వెల్లడించారు. అధికారుల కృషితో 21.7 శాతం అభివృద్ధి రేటుతో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నామని తెలిపారు.

సంక్షేమంలో కూడా దేశంలో నంబర్ వన్ గా ఉన్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు కూడా పింఛన్ ఇస్తున్నామని, చేనేత కార్మికులకు సబ్సిడీపై సరుకు ఇస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతులను సంఘటితం చేస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి రైతులకు ఎకరానికి 8 వేలు పెట్టుబడి సాయం ఇస్తున్నామని చెప్పారు.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరం లేకున్నా సిజేరియన్లు చేసి ఆడవాళ్ల ఆరోగ్యం ఖరాబు చేస్తున్నారని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దాన్ని నివారించేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా కేసీఆర్ కిట్ పెట్టినమని, దానివల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు మూడు రెట్లు పెరిగినయని వివరించారు. గతంలో సర్కారు దవాఖానల్లో ఏడాదికి లక్షా 20 వేల నుంచి లక్షా 60 వేల వరకు ప్రసవాలు జరిగితే.. ఇప్పుడు ఆ సంఖ్య నాలుగున్నర లక్షలకు చేరిందన్నారు. తల్లీబిడ్డలకు కేసీఆర్ కిట్ తో పాటు ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 ఇస్తున్నామని చెప్పారు.

ఈ సభలో మంత్రి హరీశ్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీలు ప్రభాకర్ రెడ్డి, వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, పలువురు ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్ శర్మ, కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.