సింగూరు, నిజాంసాగర్ కింద రెండో పంటకు నీళ్లు!

తెలంగాణ రాష్ట్రం వస్తే రెండో పంటకు కూడా నీరు ఇచ్చుకునే విధంగా నీటి పారుదల వ్యవస్థను మార్చుకుంటామనే మాట నిజమవుతున్నది. పాత నిజామాబాద్, మెదక్ జిల్లాల పరిధిలోని రైతుల చిరకాల వాంఛ అయిన రెండో పంటకు నీరందే స్వప్నం నెరవేరుతున్నది. ఈ రెండు జిల్లాల పరిధిలోని రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు సింగూరు ద్వారా రెండో పంటకు అవసరమైన నీరు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 29 టిఎంసిల గరిష్ట నీటిమట్టం ఉన్నది. దీంతో ఈ నీటిని నిజాం సాగర్ కు అందించి రెండో పంటకు నీరందించాలని మంత్రులు పోచారం శ్రీనివాస రెడ్డి, హరీశ్ రావులు హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రిని కోరారు. సింగూరు నుంచి నీరు విడుదల చేయడం ద్వారా నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ఆందోళ్ నియోజకవర్గాల పరిధిలో రెండు లక్షల ఎకరాల్లో రెండో పంట పండించుకునే అవకాశం ఉందని వారు ముఖ్యమంత్రికి చెప్పారు. రెండో పంట పండించుకోవడం ఇక్కడి ప్రజల కోరిక అని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ కల నెరవేరే అవకాశం వచ్చిందని విన్నవించారు.

కాల్వలు కూడా సిద్ధంగా ఉన్నందున సింగూరు నుంచి నిజాంసాగర్ కు 9 టిఎంసిల నీరు వదిలితే, ఇప్పటికే ఉన్న 3 టిఎంసిల నీటితో కలిపి నిజాంసాగర్ లో నీరు 12 టిఎంసిలకు చేరుకుంటుందని పోచారం చెప్పారు. ఆ నీటిని చాలా పొదుపుగా వాడుకుని నిజాంసాగర్ ఆయకట్టు కింద ఉన్న లక్షా 20వేల ఎకరాల్లో రెండో పంట సాగుచేసుకుంటారని మంత్రి పోచారం వివరించారు.

అదే విధంగా సింగూరు నుంచి నీరు విడుదల చేయడం ద్వారా ఘణపురం ఆనికట్టును నింపుకుని 30వేల ఎకరాలకు, ఆందోళ్ ఎత్తిపోతల పథకాల ద్వారా మరో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని హరీష్ రావు చెప్పారు.

మంత్రుల విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. సమైక్య రాష్ట్రంలో రైతులు మొదటి పంట పండించుకోవడానికే నీళ్లు లేక అవస్థలు పడ్డారని, ఇప్పుడు రెండో పంట పండించుకునే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనే వదులుకోవద్దని సీఎం చెప్పారు. సింగూరు నుంచి నిజాం సాగర్ కు 9 టిఎంసిల నీరు విడుదల చేయాలని ఆదేశించారు.

ఇవాళ సాయంత్రం నుంచే నీటి విడుదల చేస్తామని మంత్రి హరీష్ రావు చెప్పారు. నీటి విడుదల చేస్తున్న సందర్భంలోనే సింగూరు వద్ద జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని జెన్ కో సిఎండి ప్రభాకర్ రావును సీఎం ఆదేశించారు. సింగూరు వద్ద 15 మెగావాట్ల యూనిట్ తో పూర్తి స్థాయి జల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ప్రభాకర్ రావు వెల్లడించారు.