సింగరేణి తెలంగాణ కొంగు బంగారం

సింగరేణి కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి వరాల జల్లు కురిపించారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని చెప్తూనే.. కొత్తవి కూడా ప్రకటించారు. డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు, రూ.10లక్షల వరకు వడ్డీలేని ఇండ్ల రుణాలు, మెడికల్‌బోర్డు ప్రక్షాళన, క్వార్టర్లకు ఏసీలు, పిల్లల ఉన్నతవిద్యకు ఖర్చు, అంబేద్కర్ జయంతికి సెలవు, యూనియన్ సభ్యత్వ రుసుం రూపాయికి తగ్గింపు వంటి వరాలు ప్రకటించిన సీఎం.. ఏండ్ల నుంచి వేళ్లూనుకుపోయిన అవినీతి భరతం పడుతామని ప్రతినబూనారు. ప్రగతిభవన్‌లో జరిగిన సింగరేణి కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,టీబీజీకేఎస్ నేతలు  పాల్గొన్నారు. స్పాట్‌

కార్మికుల సమస్యలు తెలుసుకొనేందుకు స్వయంగా సింగరేణి యాత్ర చేపడుతానని, ప్రతి క్వార్టర్ తిరిగి కార్మికులను కలిసి సమస్యలు విని, ఒక్కొక్కటి పరిష్కరించుకొంటూ ముందుకు పోతానని హామీ ఇచ్చారు. తెలంగాణకు సింగరేణి కొంగుబంగారమని, దాన్ని కాపాడుకొంటూ కార్మికులకు ఫలాలు అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ సంఘాలు, పార్టీలు మాత్రమే గెలుస్తున్నాయని చెప్పిన సీఎం కేసీఆర్.. ఈసారి గెలుపు కార్మికులదని, వారికి ప్రతిఫలం దక్కాలన్నారు.

సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. వారసత్వ ఉద్యోగాలు కల్పించి తీరుతామన్నారు. ఒకవేళ ఉద్యోగం వద్దంటే 25 లక్షల నగదు, అదీ కాదంటే నెలకు 25 వేలు ఇస్తమని స్పష్టం చేశారు. అటు ఇంటికోసం 10 లక్షల వడ్డీలేని రుణం ఇస్తమని చెప్పారు. కార్మికుల తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ వైద్యం అందిస్తామని తెలిపారు. 190 కన్నా తక్కువ మస్టర్లున్న కార్మికులను వారంలోపే రెగ్యులర్ చేస్తామన్నారు.

లంచం అడిగినోళ్లను, తీసుకొనేటోళ్లను చెప్పుతో కొట్టాలని ముఖ్యమంత్రి అన్నారు. మెడికల్ అన్‌ఫిట్ నుంచి క్వార్టర్ల కేటాయింపు వరకు ప్రతిపనిలో గత పాలకులు లంచాలు తీసుకోవడం ప్రారంభించారని చెప్పారు. ఇకనుంచి ఆ సంస్కృతికి చరమగీతం పాడుదామని కార్మికులకు పిలుపునిచ్చారు. లంచం అంతం చేయాలని పలుమార్లు కోరిన సీఎం కేసీఆర్ ….ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థ ప్రారంభిస్తామని కూడా ప్రకటించారు. చరిత్రలో నిలిచిపోయేలా 11 డివిజన్లకు 9 డివిజన్లు గెలిపించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.

కేవలం బొగ్గు గనులకు మాత్రమే సింగరేణిని పరిమితం చేయకుండా ఇతర ఖనిజాల తవ్వకాలను అప్పగించి విస్తరిస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. భూగర్భ గనులను కాపాడుకొంటామని, త్వరలో మరో ఆరు గనులను ప్రారంభిస్తామని చెప్పారు. ఓపెన్ కాస్ట్ గనులు అవసరం అని, వాటి లాభనష్టాలు సమన్వయం చేసుకుంటూ ముందుకుపోతామని పేర్కొన్నారు. అక్రమాలకు, లంచాలకు నిలయంగా మారిన, కార్మికుల రక్తం తాగుతున్న ప్రస్తుత మెడికల్ బోర్డును ప్రక్షాళన చేస్తామని చెప్పారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసారు.కార్మికులు ఏ సంఘంవారైనా …..అందరి బాగు చూసుకుంటానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.అటు సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై సింగరేణి కార్మిక లోకం హర్శం వ్యక్తంచేసింది.