సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకు ఆదేశాలు

సింగరేణి కార్మికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యానికి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఆదేశాలు జారీచేసింది. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకునే కార్మికులకు ఏకమొత్తంలో రూ.25 లక్షలు అందించేలా చర్యలు తీసుకోవాలని.. అలా వద్దనుకునే వారికి నెలకు 25 వేలు వేతనంగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని తెలిపింది. సొంతఇల్లు నిర్మించుకునే కార్మికులకు 10లక్షల వరకు వడ్డీలేని రుణం, ఇతరుల పేర్లతో కొనసాగుతున్న కార్మికులకు పేర్లను సవరించుకొనే అవకాశం కల్పించాలని చెప్పింది. కార్మికుల తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ రిఫరల్ హాస్పిటల్స్ లో వైద్యం అందించాలని ఆదేశించింది. ఉద్యోగ అవకాశాలు కల్పించేలా మరో ఆరు భూగర్భగనులు ప్రారంభించాలని, దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని సీఎంవో చెప్పింది.  మహిళా కార్మికులకు పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని, అంబేద్కర్ జయంతిని పెయిడ్ హాలీడేగా ప్రకటించాలని ఆదేశించింది.