సింగరేణి ఎన్నికలకు సర్వం సిద్ధం    

సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు తెరలేచింది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. రాత్రి ఏడు గంటల నుంచి ఏరియాల వారీగా  ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అర్థరాత్రి లోగా తుదిఫలితం వచ్చే అవకాశం ఉంది.  రహస్య బ్యాలెట్‌ ద్వారా జరగనున్న ఈ ఎన్నికల్లో 52వేల 534 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఢిల్లీలోని సింగరేణి కార్యాలయంలో ముగ్గురు ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అటు ఓటు హక్కు వినియోగించుకోనున్న వారి జాబితాలను అన్ని కార్మిక సంఘాలకు అందజేశారు అధికారులు. ఓటింగ్‌లో పాల్గొనే కార్మికులు, ఉద్యోగులు తప్పనిసరిగా తమ ఐడీ కార్డు వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. లేదంటే ఒక పాస్‌పోర్ట్‌ ఫోటో వెంట తెచ్చుకుంటే.. సింగరేణి లైజన్‌ ఆఫీసర్‌ తాత్కాలిక గుర్తింపు కార్డు జారీ చేసి ఓటింగ్‌కు అనుమతిస్తారని తెలిపారు.

ఆరుజిల్లాల కలెక్టర్ల కార్యాలయాల నుంచి ప్రతిపాదించిన రెవెన్యూ, ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులనే..  పోలింగ్‌, పోలీస్‌, కౌంటింగ్‌ సిబ్బందిగా నియమించారు.  సింగరేణిలో మొత్తం 11 ఏరియాల్లో ఓటింగ్ జరగనుంది. 92 పోలింగు బూత్ లను ఏర్పాటు చేశారు. రామగుండం ఏరియా-1, మందమర్రి లో అత్యధికంగా 13 పోలింగ్ కేంద్రాలు, ఇల్లందులో అతి తక్కువగా 4 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇక కార్పోరేట్‌ ఏరియాలో 5 పోలింగ్‌ కేంద్రాలు, కొత్తగూడెం ఏరియాలో 7 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మణుగూరులో ఆరు, రామగుండం ఏరియా టూలో ఆరు, రామగుండం ఏరియా త్రీలో ఏడు, భూపాలపల్లిలో తొమ్మిది, బెల్లంపల్లిలో ఐదు, శ్రీరాంపూర్‌ ఏరియా వన్‌లో 8, శ్రీరాంపూర్‌ ఏరియా టూలో 9 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.  ఏ ఏరియా ఓట్లను అదే చోట లెక్కిస్తారు. మొదట ఏరియాల వారీగా ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం అన్ని ఏరియాల ఓట్లను క్రోడీకరించి తుది ఫలితం ప్రకటిస్తారు. తొలి ఫలితం ఇల్లందు ఏరియా నుంచి రానుంది. ఫైనల్ గా కార్పొరేట్ ఏరియా రిజల్ట్ ను ప్రకటిస్తారు.

సింగరేణి గుర్తింపు సంఘానికి ఇది ఆరో ఎన్నిక. ఇంతకుముందు  5సార్లు ఎన్నికలు జరిగాయి. ఐదు ఎన్నికల్లో మూడుసార్లు ఏఐటీయూసీ, ఒక్కోసారి ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్‌ గెలుపొందాయి. ప్రస్తుతం జరుగుతున్న 6వ దపా ఎన్నికల బరిలో 15 కార్మికసంఘాలు ఉన్నప్పటికీ.. టీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ .. ఏఐటీయూసీ కూటమి మధ్యే పోటీ నెలకొంది. అయితే ప్రస్తుతం సింగరేణిలో కార్మికలోకమంతా  సీఎం కేసీయార్‌ వెంటే మేమని స్పష్టం చేస్తుండటంతో…. టీబీజీకేఎస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది.