సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం

సీఎం కేసీఆర్ మాట రామబాణం అన్నారు టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత. ముఖ్యమంత్రికి సింగరేణి అంటే గుండెల నిండా ప్రేమ ఉందని.. ఆయన ఒక్కసారి మాటిస్తే వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ బాణం గుర్తుకు ఓటేసి చుక్క గుర్తోళ్లకు చుక్కలు చూపించాలని సింగరేణి కార్మికులకు కవిత పిలుపునిచ్చారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తామంటే ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రచారానికి వచ్చే మిగతా యూనియన్లను నిలదీయానికి ఎంపీ కవిత కార్మికులను కోరారు. ఓటమి భయంతోనే టీబీజీకేఎస్ కు వ్యతిరేకంగా అన్ని యూనియన్లు ఏకమైనయని విమర్శించారు.

మంచిర్యాల జిల్లా మందమర్రిలో టీబీజీకేఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గులాబీ నేతలకు సింగరేణి కార్మికులు బ్రహ్మరథం పట్టారు. భారీఎత్తున తరలి వచ్చి, సభను విజయవంతం చేశారు. ప్రభుత్వ విప్‌ నల్లాల ఓదెలు, ఎంపీ బాల్క సుమన్‌, ప్రభుత్వ సలహాదారు వివేక్‌, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్‌రావు, నాయకులు కెంగర్ల మల్లయ్య, రాజిరెడ్డి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ ఫరూఖ్, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.

సింగరేణి కార్మికులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు ఎంపీ కవిత. తెలంగాణ ఏర్పడగానే అసెంబ్లీ సాక్షిగా వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటిస్తే.. విపక్షాలు కోర్టుకు పోయి, అడ్డుకున్నాయని మండిపడ్డారు. న్యాయ నిపుణులతో, ఉన్నతాధికారులతో చర్చించామని,  ఎవరెన్ని కుట్రలు చేసినా వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతమని ఎంపీ కవిత స్పష్టం చేశారు.

అండర్ గ్రౌండ్ మైన్స్ లో మెడికల్ అన్ ఫిట్ అయిన కార్మికులకు జీతం తగ్గకుండా చూస్తామని హామీ ఇచ్చారు. బెల్లంపల్లి ఏరియాలో లాకౌట్ ఎత్తివేయిస్తామని, సింగరేణి కార్మికుల ఇళ్లకు ఏసీ కనెక్షన్ వసతి కల్పిస్తామని చెప్పారు. సింగరేణి కార్మికులు సొంత ఇల్లు కట్టుకున్నా, కొనుక్కున్నా రూ. 6 లక్షల వరకు వడ్డీ లేని ఇంటి రుణం ఇస్తామని తెలిపారు.

సింగరేణిలో ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఎంపీ కవిత చెప్పారు. అరవై ఏళ్లలో ఏ ముఖ్యమంత్రీ సింగరేణిని అర్థం చేసుకోలేదని,  సీఎం కేసీఆర్ కు అణువణువూ తెలుసన్నారు. సీఎం కేసీఆర్ ఏం చేస్తామన్నా ఓ ముఠా కేసులు వేసి అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. వారసత్వ ఉద్యోగాలపై కోర్టు కేసు కామా తప్ప ఫుల్ స్టాప్ కాదన్నారు.

సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు అని ఎంపీ సుమన్ చెప్పారు. సింగరేణి కార్మికులంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి సిరుల గనిగా మారుతదన్నారు. సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్‌దే గెలుపుఅన్నారు ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు.

ఈ సందర్భంగా ఎంపీ కవిత సమక్షంలో పలు కార్మిక సంఘాల నేతలు, కార్మికులు టీబీజీకేఎస్ లో చేరారు.