సింగరేణిలో గులాబీ జెండా రెపరెపలు

సింగరేణి ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ప్రభంజనం సృష్టించింది! బొగ్గు బావుల్లో గులాబీ దండు మరోసారి వికసించింది. పుడమితల్లి గర్భంలో చెమట చిందించే సింగరేణి కార్మికులు కుట్రల సంఘాలకు పాతరేశారు! సిద్ధాంతాలు పక్కన పెట్టి నీతిమాలి జట్టుకట్టిన జాతీయ సంఘాలకు దిమ్మదిరిగే సమాధానమిచ్చారు!  కార్మికులను కడుపులో పెట్టి చూసుకుంటున్న సీఎం కేసీఆర్‌ను సింగరేణి సూరీళ్లు గుండెల్లో పెట్టుకున్నారు! పదకొండు డివిజన్లలో తొమ్మిదింట టీబీజీకేఎస్‌ను గెలిపించి సీఎం కేసీఆర్‌పై తమ విశ్వాసాన్ని చాటుకున్నారు!

అనూహ్యమేమీ కాదిది! తెలంగాణ బొగ్గు బావుల్లో ఊహించిన గులాబీ మెరుపే. సిద్ధాంతాలను పక్కనపెట్టిన పాచికలు పారలేదు. జాతీయ సంఘాల నీతిమాలిన వ్యూహాలూ ఫలించలేదు. ప్రజాక్షేత్రంలో విజయానికి మారుపేరైన గులాబీ దళం.. కార్మిక క్షేత్రంలోనూ సత్తా చాటింది! కార్మికుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పడుతున్న తపన, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు ఎంపీ కవిత అంకితభావం ఏకమై రామ బాణంలా దూసుకెళ్లాయి! ఫలితంగా సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ అఖండ విజయం సాధించింది!

ఏకపక్షంగా సాగిన ఈ ఎన్నికల్లో సింగరేణి కార్మికులు తమ ఇంటి సంఘానికి బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి తిరుగులేని మెజార్టీని కట్టబెట్టారు! మొత్తం 11 డివిజన్లకు గాను తొమ్మిదింటిలో టీబీజీకేఎస్‌ విజయఢంకా మోగించింది! మరోసారి టీబీజీకేఎస్‌ గుర్తింపు హోదా దక్కించుకుంది. ప్రత్యర్థులంతా ఒక్కటై కూటమి కట్టినా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కార్మికులంతా సీఎం కేసీఆర్, ఎంపీ కవిత వెంటే నిలిచారు. భారీగా నమోదైన పోలింగ్ టీబీజీకేఎస్ విజయాన్ని కౌంటింగ్‌కు ముందే తేల్చింది. ప్రత్యర్థి వర్గం కనీసం టీబీజీకేఎస్ దరిదాపుల్లో కూడా నిలవలేకపోయింది!  సింగరేణి కార్పొరేట్‌ ఆఫీసులో కూడా గులాబీ జెండా తొలిసారి సగర్వంగా రెపరెపలాడింది.

సింగరేణి విస్తరించి ఉన్న ఆరు జిల్లాల్లో కార్మికవర్గం ప్రభుత్వ విధానాలను బలంగా సమర్థించింది! సీఎం కేసీఆర్‌పై విశ్వాసాన్ని, ఎంపీ కవితపై భరోసాను వ్యక్తం చేసింది. మొత్తం 11 డివిజన్లలో 49,877 ఓట్లు పోల్ కాగా.. టీబీజీకేఎస్‌ 23,848 ఓట్లతో ప్రభంజనం సృష్టించింది! పోలింగ్‌ శాతం 94.93 కాగా, టీబీజీకేఎస్‌ 45.40 శాతం ఓట్లను కైవసం చేసుకుంది! కార్పొరేట్ ఆఫీస్ సహా కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, రామగుండం-1, రామగుండం-2, రామగుండం-3, బెల్లంపల్లి, శ్రీరాంపూర్‌లో టీబీజీకేఎస్‌ ఘనవిజయం సాధించింది.

సింగరేణిపై తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కున్న అవ్యాజమైన ప్రేమ, అప్యాయతకు సింగరేణి కార్మికులు ముగ్ధులయ్యారు. ఆ ఫలితం ఓట్ల రూపంలో ప్రతిఫలించింది. కార్పొరేట్ కార్యాలయంలో భాగంగా హైదరాబాద్‌లో ఉన్న సింగరేణి భవన్‌లో ఆ ప్రభావం మొదటిసారిగా కనపడింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రభంజనం సింగరేణి భవన్‌ నుంచే ప్రారంభమైంది. సింగరేణి భవన్‌లో మొత్తం 86 ఓట్లకు గాను 84 ఓట్లు పోలవ్వగా.. టీబీజీకేఎస్‌కు 77 ఓట్లు రావడం విశేషం. ఇక్కడ ప్రత్యర్థి వర్గం సింగిల్ డిజిట్లకే పరిమితమైంది.

కౌంటింగ్ ప్రారంభమైన క్షణం నుంచే టీబీజీకేఎస్ హవా కొనసాగింది. టీబీజీకేఎస్‌కు తొలి కానుక ఇల్లెందు డివిజన్‌ అందించింది. ఇక్కడ జాతీయ సంఘాలు విశ్వప్రయత్నం చేసినా ..  సింగరేణి కార్మికులు నమ్మలేదు. అందరూ కలిసి గులాబీ సంఘాన్నే గెలిపించుకున్నారు. ఇల్లెందులో మొత్తం 1095 ఓట్లు పోలవగా.. టీబీజీకేఎస్‌ 618 ఓట్లు సాధించింది. 218 ఓట్ల మెజార్టీతో  ఘన విజయం సాధించింది.

కొత్తగూడెంలోని సింగరేణి కార్పొరేట్ ఆఫీసులోనూ గులాబీ దళం పాగా వేసింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తొలిసారిగా ఇక్కడ జయకేతనం ఎగరేసింది. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో పోలైన ఓట్లతో కలిపి ఇక్కడ మొత్తం 1475 ఓట్లకు గాను 1415 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీబీజీకేఎస్‌కు 866 ఓట్లు వచ్చాయి. 544 ఓట్ల మెజార్టీతో టీబీజీకేఎస్ బంపర్ విక్టరీ కొట్టింది.

కొత్తగూడెం ఏరియాలో టీబీజీకేఎస్ దూకుడుకు ప్రత్యర్థులు చిత్తయ్యారు. విపక్షాల అసంబద్ధ పొత్తులను కార్మికులు చిత్తుచిత్తు చేశారు. అసత్య ప్రచారాలు చేసిన జాతీయ సంఘాలకు కర్రు కాల్చి వాత పెట్టారు. కొత్తగూడెం ఏరియాలో మొత్తం 3592 ఓట్లు పోలవగా, ఇంటి సంఘానికి 2012 ఓట్లు దక్కాయి. 811 ఓట్ల మెజార్టీతో టీబీజీకేఎస్ అఖండ విజయం సాధించింది.

ఇక మణుగూరు ఏరియాలో విపక్షాల అడ్రస్ గల్లంతైంది. జాతీయ సంఘాల ఆటలు కార్మికుల ముందు సాగలేదు. కార్మికులంతా టీబీజీకేఎస్‌కే పట్టాభిషేకం చేశారు. మణుగూరు డివిజన్‌లో పోలైన 2816 ఓట్లలో టీబీజీకేఎస్‌ 1621 ఓట్లు సాధించింది. 629 ఓట్ల మెజార్టీతో తిరుగులేని విజయం సొంతం చేసుకుంది.

బెల్లంపల్లి ఏరియాలోనూ జాతీయ సంఘాల ఊసే లేకుండా పోయింది. కట్టగట్టుకొని వారసత్వ ఉద్యోగాలను అడ్డుకున్న సంఘాలను కార్మికులు నిలువునా పాతరేశారు. కార్మికులంతా టీబీజీకేఎస్‌కే మద్దతు పలికారు. బెల్లంపల్లి డివిజన్‌లో మొత్తం 1683 ఓట్లు పోలయ్యాయి. ఇందులో  871 ఓట్లు గెలుచుకున్న టీబీజీకేఎస్‌ 183 ఓట్ల మెజార్టీతో ప్రతిపక్షాలను మట్టికరిపించింది.

ఇక అత్యధిక ఓట్లు గల శ్రీరాంపూర్ డివిజన్‌లో టీబీజీకేఎస్ రామబాణంలా దూసుకెళ్లింది. సీఎం కేసీఆర్‌పై కార్మికులకున్న నమ్మకం జాతీయ సంఘాలను పాతరేసింది. శ్రీరాంపూర్ డివిజన్‌లో మొత్తం 11266 ఓట్లు పోలవగా..  టీబీజీకేఎస్‌ 6,189 ఓట్లు దక్కించుకుంది. 2,243 ఓట్ల తిరుగులేని ఆధిక్యంతో ప్రభంజనం సృష్టించింది.

రామగుండంలోని మూడు డివిజన్లలోనూ టీబీజీకేఎస్‌ హవా కొనసాగింది. రామగుండం ఏరియా-1లో మొత్తం 6476 ఓట్లు పోలవగా, టీబీజీకేఎస్‌ 2751 ఓట్లు సాధించింది. 367 ఓట్ల స్పష్టమైన మెజార్టీతో అద్భుత విజయం సొంతం చేసుకుంది. రామగుండం ఏరియా-2లో మొత్తం 4 వేల ఓట్లు పోలయ్యాయి. ఇందులో 1827 ఓట్లు దక్కించుకున్న టీబీజీకేఎస్, 895 ఓట్ల ఆధిక్యంలో తిరుగులేని విజయం సాధించింది. ఇక రామగుండం మూడో డివిజన్‌లో 5004 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 2102 ఓట్లతో సత్తా చాటిన టీబీజీకేఎస్‌ 229 ఓట్ల మెజార్టీతో  బంపర్ విక్టరీ కొట్టింది.

సిద్ధాంతాలను పక్కనపెట్టి నీతిమాలిన పొత్తులతో కుటిలయత్నం చేసిన ఏఐటీయూసీకి ఈ ఎన్నికల్లో రెండు డివిజన్లలో కంటితుడుపు విజయం దక్కింది. భూపాలపల్లి, మందమర్రి ఏరియాల్లో మాత్రమే ఏఐటీయూసీ కూటమి గట్టెక్కింది. ప్రత్యర్థి పార్టీలు, సంఘాలు గతంలో చేసిన అన్యాయాలు, కార్మిక వ్యతిరేక విధానాలకు ఈ దఫా ఎన్నికల్లో కార్మికులు మూతోడ్ సమాధానమిచ్చారు. సీఎం కేసీఆర్‌పై కార్మికులకున్న చెక్కు చెదరని విశ్వాసం బొగ్గు గనుల మీద గులాబీ జెండా సగర్వంగా రెపరెపలాడించింది.