సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి శంకుస్థాపనలు

రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడి ఒక వసంతం పూర్తైంది. ఈ సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్లు, పోలీస్ కార్యాలయాలు నిర్మాణానికి సర్కారు శ్రీకారం చుట్టింది. దీంతో కొత్తగా నిర్మించే ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయాలకు శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఆయా జిల్లాల్లో ఈ శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

జనగామ జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జనగామ నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎ్రరబెల్లి దయాకర్‌రావు, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎంపీలు బూర నర్సయ్య గౌడ్‌, పసునూరి దయాకర్‌ పాల్గొన్నారు. కరువుతో అల్లాడుతున్న జనగామ జిల్లాకు దేవాదుల ద్వారా సాగునీరు అందిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు.

కామారెడ్డి జిల్లాలో నూతన కలెక్టరేట్ తో పాటు జిల్లా పోలీస్ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ ఘనంగా జరిగింది. వడ్లూర్ శివారులో కొత్త భవనాల నిర్మాణానికి మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, హన్మంత్ షిండే, రాజేశ్వర్, గంగాధర్ గౌడ్ లో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. పాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న నూతన జిల్లాల ఏర్పాటు నిర్ణయం సత్ఫలితాలు ఇస్తోందన్నారు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి.

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో నూతన కలెక్టరేట్‌ నిర్మాణానికి భూమి పూజ ఘనంగా జరిగింది. కొత్త కలెక్టరేట్ కు మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నగేశ్‌, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్‌ జిల్లాలో నూతన కలెక్టరేట్ నిర్మాణానికి భూమిపూజ ఘనంగా జరిగింది. శామీర్‌ పేట మండలం అంతాయిపల్లిలో కలెక్టరేట్‌ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌ రెడ్డి, కృష్ణారావు, చింతల కనకారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్‌ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయానికి శంకుస్థాపన అంగరంగ వైభవంగా జరిగింది. కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాల నిర్మాణానికి మంత్రి జూపల్లి కృష్ణారావు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ తదితరులు పాల్గొన్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజల వద్దకే పాలన వచ్చిందన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆవిర్భావ వేడుకలకు మంత్రి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయ భవనాలకు మంత్రి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్ కుమార్, మాజీ ఎంపీ మంద జగన్నాథంతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా ఉన్నారని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లాలోని పెద్దకల్వల ఎస్సారెస్పీ క్యాంపు కార్యాలయం ఆవరణలో నూతన కలెక్టరేట్ నిర్మాణానికి హోంమంత్రి నాయిని   భూమిపూజ చేశారు. పెద్దపల్లి పట్టణానికి వారం రోజుల్లో మహిళా పోలీస్ స్టేషన్ ను, త్వరలోనే రూరల్ పోలీస్ స్టేషన్ ను మంజూరు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బాల్క సుమన్, ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, పుట్ట మధుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

వనపర్తి జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన ఘనంగా జరిగింది. వనపర్తి మండలంలోని నాగవరం గ్రామ పచాయతి పరిధిలో కొత్త కలెక్టరెట్, ఎస్పీ ఇతర జిల్లా శాఖల కార్యాలయాల భవన సముదాయాల నిర్మాణానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వనపర్తి మండలంలోని పెద్దగూడెం, అప్పాయిపల్లి గ్రామలలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. కొత్త కలెక్టరేట్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేస్తామని ఎంపీ కొండా విశ్వేశ‌్వర్ రెడ్డి చెప్పారు. వికారాబాద్ లో జిల్లా ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయం నిర్మాణానికి భూమిపూజ చేశారు.